బడికెళ్తున్నా సెల్ఫీ... గుడి కొచ్చినా ఫొటో... వంట చేస్తూ వీడియో... స్మార్ట్ ఫోన్‌తో మొదలై, సోషల్‌మీడియాతో విపరీతంగా మారిన పోకడలకు ఉదాహరణలు ఇవి. ఇటీవలి కాలంలో వీటన్నింటినీ మించి వీడియో వైరల్ కిక్ కల్చర్ పెరుగుతోంది. జాఢ్యంలా విస్తరిస్తున్న దీని కారణంగా అనేక మంది మానవత్వాన్ని సైతం మర్చిపోతున్నారు. మొన్న నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌కు కత్తిపోట్ల ఉదంతం... నిన్న చిన్నటేకూరులో జరిగిన వి.కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం... ఇలా అనేక ఉదంతాల్లో స్పందించాల్సిన వ్యక్తులే వీడియో రికార్డింగ్‌కు పరిమితం అవుతున్నారు.
ఆ ఉదంతంపై నిజామాబాద్ సీపీ సాయి చైతన్య... ఈ ఉదంతంపై నగరవాసి హేమ ఈ ధోరణి పైనే ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పెరుగుతున్న ఈ వీడియో వైరల్ కల్చర్‌పై పోలీసులు, నిపుణులు చెప్తున్న అభిప్రాయాలివి...
ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు, వాటి విలువలు తగ్గాయి. మనుషులను బట్టే సమాజం కూడా ఉంటుంది. అనేక మంది ఇళ్లల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరిలో స్వార్థం పెరిగిపోవడంతో ఎదుటి వారికి సహాయం చేస్తే నాకేంటి లాభం అని ఆలోచిస్తున్నారు. గతంలో వీరికి సహాయం అవసరమైనప్పుడు ఎవరూ ముందుకు రాకపోవడమూ ఈ ధోరణికి ఓ కారణమే.
సినిమాలు, మీడియా తదితరాలు కూడా సక్సెస్ అంటే ఉన్నత స్థితికి చేరడం, డబ్బు సంపాదించడం అంటూ.. హీరోయిజమంటే ఎదుటి వారిని కొట్టడం అన్నట్లు చూపిస్తున్నాయి. ఇలాంటి వారికి లభిస్తున్న ప్రచారం పది మందికి సహాయపడిన, పడుతున్న వారికి లభించట్లేదు.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం కూడా మానవ సంబంధాలు, అనుబంధాలు–ఆప్యాయతలు తగ్గిపోవడానికి కారణమైంది. వీటితో పాటు సమాజంలో అనునిత్యం జరుగుతున్న నేరాలు చూడటం అలవాటుపడిన వాళ్లు తమ కళ్ల ముందే ఘోరం జరుగుతున్నా స్పందించట్లేదు.
సెన్సేషనలిజాన్ని ఆస్వాదించడానికే...
కళ్లు జరుగుతున్న ఘోరాన్ని ఆపడానికి బదులు దాన్ని తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించే ధోరణి పెరిగిపోయింది. ఆ వీడియో వైరల్ కావడం వల్ల వచ్చే కిక్, ఆ సెన్సేషనలిజాన్ని ఆస్వాదించడానికి కొందరు ఇలా చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోలను సోషల్‌మీడియాలో వైరల్ చేస్తూ లైక్స్, కామెంట్స్, ఫార్వర్డ్స్‌లో తమ సక్సెస్ వెతుక్కునే వాళ్లు పెరిగిపోయారు.
స్మార్ట్ ఫోన్ సామాన్యుడి చేతికి రావడంతో ఈ మీడియా పరిధి పెరిగిపోవడం, ఇందులోని అంశాలు వేగంగా విస్తరించడం తదితర కారణాలతో తమ వీడియో వైరల్ కావడం ఓ కిక్‌గా భావిస్తున్నారు. కొన్నింటిని వైరల్ చేస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు.
సోషల్ ట్రోలర్స్..
సోషల్‌మీడియాలో ట్రోలర్స్ ఎవరనేది ఎదుటి వారికి తెలీదు. దీంతో వాళ్లు చేసే కామెంట్స్, పోస్టులు నేరుగా వీళ్లపై ప్రభావం చూపదు. ఈ కారణంగానూ ఘోరాలను వీడియో తీసి వైరల్ చేయడం అనే ధోరణి పెరిగిపోయింది. ప్రస్తుత విద్యా వ్యవస్థ మార్కులు, ర్యాంకుల ఆధారితంగా మారిపోయింది. ఈ పరిస్థితులను మారాలంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి.
తల్లిదండ్రులు, చదువు చెప్పే గురువులు ఆ కోణంలో కృషి చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక బాధ్యతలు, విలువలు విద్యలో భాగంగా మారాలి. ప్రతి వ్యక్తి జీవితంలో రోల్ మోడల్స్‌ను ఎంచుకునే విధానం మారాలి. అలా ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే ఫలితాలు ఉంటాయి.


