వచ్చింది కదా అవకాశం.. ఓ మంచి మాట అనుకుందాం.. ఎందుకు ఆలస్యం అందరినీ రమ్మందాం.. అంటూ బ్రహ్మోత్సవం సినిమాలో సీతారామశాస్త్రి రచించిన పాటను గుర్తుచేసేలా ఊరంతా ఒకేసారి విమానం ఎక్కారు. ఇందుకు హైదరాబాద్ నగరానికి చెందిన ఒకప్పటి అడ్డా కూలీ ఆతిథ్యం ఇచ్చాడు. ఒకరిని కాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా ఒకే ఊరికి చెందిన 500 మందిని విమానం ఎక్కించి గోవా తీసుకెళ్లాడు.. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.. ఆ వివరాలు..
ఒకప్పుడు ఆయనో అడ్డా కూలీ. పొట్టకూటికోసం నగరానికి వచ్చి దినసరి కూలీగా కాలం గడిపాడు.. 40 ఏళ్ల క్రితం ఫుట్‌పాత్‌పై దొరికే బ్రెడ్‌బన్ తిని బస్టాండ్ ఆవాసంగా బతికాడు.. పదేళ్ల తర్వాత 1995లో సెంట్రింగ్ పని ప్రారంభించాడు. అనతికాలంలో బీజే కన్‌స్ట్రక్షన్స్ పేరుతో పెద్ద కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు.
సొంత ఊరు నుంచి 500 మందిని విమానం ఎక్కించాడు. దీనికి తన కుమారుడి వివాహాన్ని సందర్భంగా చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆయనే జవహర్‌నగర్ మాజీ మేయర్ మేకల కావ్య తండ్రి మేకల అయ్యప్ప.
ఊరంతా ఒకేసారి..
నాగర్‌కర్నూలు జిల్లా బిజినపల్లి మండల గుడ్లనర్వ గ్రామంలో కోళ్ల ఫారంలో కూలీగా పనిచేసే అయ్యప్ప పంటలు పండక ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం ఆర్థికంగా స్థిరపడిన ఆయన జవహర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే కుమారుడి నిశి్చతార్థం సందర్భంగా ఊరందరినీ ఒకేసారి విమానం ఎక్కించి గోవా తీసుకెళ్లాడు.
ఆయన కల నెరవేర్చుకోవడంతో పాటు ఊరందరూ ఆనందపడేలా చేశాడు. ‘నా కుటుంబ సభ్యులతో పాటు.. ఊర్లో ఉన్న బంధువులను విమానంలో గోవాలో తీసుకెళ్లి వారితో ఆనందంగా గడిపాను.. ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను’ అంటున్నారు అయ్యప్ప.
(చదవండి: Success Story: ఐఐటీలో సీటు నుంచి డ్రీమ్ జాబ్ వరకు అన్ని ఫెయిలే..! కానీ ఇవాళ..)


