చిటికెలో చెట్టు చుట్టూ పాదు! | moode vinayak launches Design of a foot-making machine | Sakshi
Sakshi News home page

చిటికెలో చెట్టు చుట్టూ పాదు!

Aug 5 2025 3:46 AM | Updated on Aug 5 2025 3:46 AM

moode vinayak launches Design of a foot-making machine

పండ్ల తోటల్లో చెట్టు చుట్టూ ట్రాక్టర్‌ సాయంతో పాదులు చేసే యంత్ర పరికరం రూపకల్పన

చెట్టు చుట్టూతా 1.5 నిమిషాల్లో పాదు తవ్వుతుంది

5 లీటర్ల డీజిల్‌ ఖర్చుతో గంటకు 35 పాదుల తవ్వకం 

సంప్రదాయ పద్ధతితో పోల్చితే 45% ఖర్చు, 30% సమయం ఆదా..

మామిడి, జామ, బత్తాయి, సన్న నిమ్మ, పెద్ద నిమ్మ.. తదితర తోటల్లో మొక్కలు నాటిన తర్వాత 5–10 ఏళ్ల వరకు పసిబిడ్డల్లా పెంచుకోవాలి. మొ­ద­ళ్లలో కలుపు తీయటం, పాదులు చేయటం, ఎరు­వులు వేసి మట్టిని కలియబెట్టటం.. వంటి పనుల­న్నీ అధిక శారీరక శ్రమతో కూడుకున్నవే. వ్యవ­సాయ కార్మికులు నడుము వంచి, చెమట చిందిస్తే తప్ప ఈ పనులు సజావుగా సాగవు. ఈ తోటల్లో చెట్ల దగ్గర కలుపు తీయటం, పాదులు చేయటం, ఎరువులు వేయటం రైతులకు నిత్యకృత్యం. అయి­తే, ఈ పనులను సులువుగా చేసే యంత్రపరిక­రా­లు రైతులకు అందుబాటులో లేవు. వ్యయ ప్రయా­స­లకోర్చి స్వయంగా చేసుకోవటమో, ఎక్కువ ఖర్చు పెట్టి కూలీలతోనో చేయించుకుంటున్నారు. 

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సుండుపల్లి మండలం పింఛ గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో పుట్టిన డా. మూడె వినాయక్‌ ఈ కష్టాలన్నీ చూస్తూ పెరిగారు. మడకశిర అగ్రి ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చేశారు. బాపట్ల అగ్రిక­ల్చర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంటెక్, పీహెచ్‌డీ చదివారు. డా.హరిబాబు మార్గనిర్దేశకత్వంలో తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.సి.రమణ పర్యవేక్షణలో వినాయక్‌ పీహెచ్‌డీ పూర్తి చేశారు. పరిశోధనల్లో భాగంగానే పండ్ల చెట్ల చుట్టూ ట్రాక్టర్‌ సహాయంతో సులువుగా పాదులు చేసే యంత్ర పరికరాన్ని గత ఏడాది రూపొందించారు. ప్రస్తుతం ఆదిత్య యూనివర్సిటీ(కాకినాడ)లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌­గా పనిచేస్తున్నారు.

ఉద్యాన తోటల రైతులకు ఉపయోగపడే యంత్ర పరికరాన్ని రూపొందించిన డా. వినాయక్‌ను ‘సాక్షి’ పలుకరించింది. ‘మా ప్రాంతంలో దాదాపు­గా అన్ని పొలాల్లోనూ పండ్ల తోటలే కనిపిస్తాయి. ఓపిక ఉన్నంత వరకూ నాన్నే ఈ పనులు చేసేవారు. భారమనుకున్నప్పుడు కూలీలను పెట్టి చేయించేవారు. చిన్న నాటి నుంచి మా నాన్నతో పాటు ఇతర రైతులు చెట్ల చుట్టూ పాదులు చేయటంలో సహాయ పడే యంత్ర పరికరాలు లేక పడే కష్టాలను కళ్లారా చూస్తూ పెరిగా. పరిశోధక విద్యార్థిగా ఈ సమస్యపై దృష్టి పెట్టా. ఆ కృషి ఫలితంగానే పండ్ల తోటల్లో పాదులు చేసే యంత్రం రూపొందించాన’ని అన్నారు.  

పాదులు తవ్వే యంత్రం ఎలా పనిచేస్తుంది?
చెట్ల చుట్టూ పాదులు తవ్వే యంత్రపరికరాన్ని ట్రాక్టర్‌కు అనుసంధానం చేస్తే.. హైడ్రాలిక్‌ సిస్టం ద్వారా పాదులు చేస్తుంది. ఇందులో ప్రధానమైనది బెవెల్‌ గేర్‌ (గుండ్రంగా ఉండే పళ్ల చక్రం). ఇది అర్ధ చంద్రాకారంలో రెండు భాగాలుగా ఉంటుంది. వీటికి ఊతంగా ఇనుప చట్రం అమర్చి ఉంటుంది. ట్రాక్టర్‌ చెట్టు దగ్గరకు వెళ్లి ఈ బెవెల్‌ గేర్‌ రెండు భాగాలను చెట్టు చెట్టూ పెట్టి, చట్రాన్ని బిగిస్తే పాదు పని జరుగుతుంది. చట్రం కింద వైపు రెండు నాగళ్లు, వాటికి రెండు కర్రులు ఉంటాయి. 40 హెచ్‌పీ, అంతకన్నా ఎక్కువ అశ్వశక్తి కలిగిన ట్రాక్టర్‌ ఇంజన్‌కు ఈ యంత్ర పరికరాన్ని అనుసంధానం చేస్తే హైడ్రాలిక్‌ మోటార్‌ ద్వారా పనిచేస్తుంది. ట్రాక్టర్‌ నుంచి 6 హైడ్రాలిక్‌ పైపులు అమర్చి ఉంటాయి. 

రెండు పైపులు హైడ్రాలిక్‌ మోటార్‌కు ఆయిల్‌ వెళ్లడానికి, తిరిగి ఆయిల్‌ వెనక్కు రావడానికి ఉపయోగపడతాయి. వీటిని పవర్‌లైన్, రిటర్న్‌లైన్‌ అంటారు. మిగతా 4 పైపులను రెండు సిలిండర్లకు అమరుస్తారు. బెవెల్‌ గేర్‌ తెరచుకోవ టానికి, మూసుకోవటానికి ఇవి ఉపయోగపడ తాయి. వీటితోపాటు 3 కంట్రోల్‌ లివర్స్‌ ఉంటాయి.  హైడ్రాలిక్‌ వ్యవస్థ ద్వారా దీన్ని ఆపరేట్‌ చేసినప్పుడు.. బెవెల్‌గేర్‌ ఫ్రేమ్‌ రెండుగా విడిపోయి చెట్టు కాండం చుట్టూ అల్లుకుంటుంది. ఫ్రేమ్‌ కింద అనుసంధానమై వున్న రెండు నాగళ్లు, వాటికున్న కర్రులతో చెట్టు చుట్టూతా తవ్వి పాదును ఏర్పాటు చేస్తాయి. కాండం చుట్టుకొలత మీటరు కన్నా తక్కువ గల చెట్టు చుట్టూ పాదు చేసుకోవచ్చు. 

గంటకు 32–35 పాదులు
పాదులు తీసే యంత్రం ద్వారా చెట్టు చుట్టూ 1.75 మీటర్ల వ్యాసార్ధం, 15 సెంటీ మీటర్ల లోతులో పాదును చేసుకోవచ్చు. ఒక చెట్టు చుట్టూ పాదు చేయటానికి ఒకటిన్నర నిమిషాల సమయం పడుతుంది. ట్రాక్టర్‌కు ఒక గంటకు 5 లీటర్ల డీజిల్‌తో 32 నుంచి 35 పాదులు చేసుకోవచ్చు. గంటకు రూ. 690 చొప్పున హెక్టారు తోటలో పాదులు పూర్తి చేయటానికి రూ. 4,615 ఖర్చవుతాయని, రైతులకు 30 శాతం సమయం, 45 శాతం ఖర్చు ఆదా అవుతాయని అంచనా. 

ఎక్కడ దొరుకుతుంది?
డాక్టర్‌ వినాయక్‌ తాను రూపొందించుకున్న డిజైన్‌ మేరకు పాదులు చేసే యంత్ర పరికరాన్ని ప్రై వేటు వర్క్‌షాపులో తయారు చేయించి, ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఏవైనా కంపెనీలు ముందుకు వచ్చి ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సి­టీ అనుమతితో ఈ పరికరాన్ని పెద్ద సంఖ్యలో తయారుచేసి రైతులకు అందించాల్సి వుంది. ఈ పా­దుల యంత్ర పరికరం త్వరలో రైతులకు ఉపయో­గంలోకి వస్తుందని ఆశిద్దాం. ప్రస్తుత ధర రూ. 80 వేలు. కావాల్సిన వారు బాపట్లలోని డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశా­లలో వ్యవసాయ పనిముట్లు, యాంత్రీకరణ  విభా­గం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌. రాజ్‌కిరణ్‌ (91773 45631)ను సంప్రదించాలని కళాశాల అసోసియేట్‌ డీన్‌ డీడీ స్మిత్‌ తెలిపారు.

రైతుల శ్రమ, ఖర్చు తగ్గుతాయి
ఏవైనా పెద్ద కంపెనీలు ముందుకు వచ్చి, ఈ యంత్ర పరికరాన్ని పెద్ద సంఖ్యలో తయారు చేసి విక్రయిస్తే విస్తృతంగా రైతులకు అందుతుంది. ఈ యంత్ర పరికరం రూపకల్పనతో మా అమ్మా నాన్నలతో పాటు పండ్ల తోటలు పెంచే ప్రతి రైతు శ్రమ, ఖర్చు చాలామటుకు తగ్గుతాయి. నా కృషి త్వరగా ఫలిస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుంది?
– డా. మూడె వినాయక్‌ (91330 86832), 
పాదులు చేసే యంత్ర పరికరం రూపశిల్పి.

(బిజివేముల రమణారెడ్డి, సాక్షి ప్రతినిధి, బాపట్ల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement