సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో దారుణం జరిగింది. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమపై పోటీ చేశారని కోపంతో ఒక అభ్యర్థి కుటుంబంపైకి ట్రాక్టర్ ఎక్కించారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సోమర్‌పేట గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో పాపయ్య, బాలరాజ్ అనే ఇద్దరు అభ్యర్థులు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో పాపయ్య గెలుపోందారు. దీంతో ఎన్నికల్లో తమ పైనే పోటీ చేశారనే కోపంతో ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి తమ్ముడైన చిరంజీవి అనే వ్యక్తి బాలరాజ్ కుటుంబంపై ట్రాక్టర్ ఎక్కించాడు.
ఈ ప్రమాదంలో బాలరాజుతో పాటు వారి కుటుంబ సభ్యులు బాలమణి, స్వరూప, భారతి, పద్మసత్వవలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటనతో సోమర్‌పేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ ఘటనపై సోమర్‌పేట గ్రామం భగ్గుమంది. గెలిచిన అభ్యర్థి పాపయ్య సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా కలిసి ఎల్లారెడ్డిలో 4 గంటలుగా ధర్నా చేపడుతున్నారు.
ఎల్లారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మెుహరించారు. రాష్ట్రంలో మూడుదశలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఆదివారం రెండో విడత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. చివరిదశ ఎలక్షన్లు 17 తారీఖున జరగనున్నాయి.


