కాంగ్రెస్ జోరు..
జుక్కల్ నియోజకవర్గంలో..
● రెండో విడతలో మెజారిటీ
పంచాయతీలు హస్తం ఖాతాలోకి..
● పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్ మద్దతుదారులు
● గాంధారిలో రికార్డు స్థాయి మెజారిటీ
రాష్ట్రంలో ప్రజాపాలనకు ఆశీర్వాదమే పంచాయతీ ఎన్నికల ఫలితాలు. జుక్కల్ నియోజకవర్గంలో 75 శాతం పంచాయతీలలో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు. మూడో విడతలోనూ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటాం. ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల అభిమానాన్ని మరింత చూరగొంటాం.
– లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే, జుక్కల్
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. అందుకే మా పార్టీకి అండగా నిలిచారు. ఓటర్ల ఆదరణతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మెజారిటీ పంచాయతీలను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. ప్రజల మద్దతుతో గ్రామాల అభివృద్ధికి మరింతగా కృషి చేస్తాం.
– మదన్‌మోహన్‌రావు, ఎమ్మెల్యే, ఎల్లారెడ్డి
జిల్లాలో రెండో విడతలో గాంధారి, లింగంపేట, మహ్మద్‌నగర్, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, పిట్లం, ఎల్లారెడ్డి మండలాల పరిధిలోని 197 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 44 గ్రామాల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 1,654 వార్డులు ఉండగా 776 మంది వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 153 సర్పంచ్ పదవులకు 606 మంది, 873 వార్డులకు 2,655 మంది పోటీ పడ్డారు. ఆదివారం పోలింగ్ నిర్వహించారు. సర్పంచ్ స్థానాలు ఎక్కువగా కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఆదివారం ఎన్నికలు నిర్వహించిన 153 స్థానాలలో 104 పంచాయతీలు కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకోగా.. 29 చోట్ల బీఆర్‌ఎస్ మద్దతుదారులు, ఎనిమిది చోట్ల బీజేపీ మద్దతుదారులు, 12 స్థానాలలో స్వతంత్రులు గెలుపొందారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో..
ఎల్లారెడ్డి మండలంలో 31 పంచాయతీలు ఉండగా ఐదు ఏకగ్రీవమయ్యాయి. 26 సర్పంచ్ పదవులకు 70 మంది పోటీ పడ్డారు. 20 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, ఐదు గ్రామాల్లో బీఆర్‌ఎస్, ఒక పంచాయతీలో ఇండిపెండెంట్ గెలుపొందారు. లింగంపేట మండలంలో 41 పంచాయతీలకుగాను 14 ఏకగ్రీవమయ్యాయి. 29 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 24 గ్రామాల్లో కాంగ్రెస్, మూడు చోట్ల బీఆర్‌ఎస్, రెండు చోట్ల బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారు. నాగిరెడ్డిపేట మండలంలో 27 పంచాయతీలకుగాను ఆరు ఏకగ్రీవమయ్యాయి. 21 పంచాయతీలకు ఎన్నికలు జరిగ్గా.. ఎనిమిది గ్రామాల్లో కాంగ్రెస్, ఐదు గ్రామాల్లో బీఆర్‌ఎస్, ఒక చోట బీజేపీ, ఏడు చోట్ల స్వతంత్రులు గెలిచారు. గాంధారి మండలంలో 45 పంచాయతీలు ఉండగా 16 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29 స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. 22 చోట్ల కాంగ్రెస్, నాలుగు స్థానాల్లో బీఆర్‌ఎస్, రెండింటిలో బీజేపీ మద్దతుదారులు, ఒకచోట స్వతంత్య్ర అభ్యర్థి గెలుపొందారు.
గాంధారి మండల కేంద్రంలో..
మండల కేంద్రమైన గాంధారిలో మమ్మాయి రేణుక భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆమె తన సమీప ప్రత్యర్థి ఆకుల కల్పనపై 2,119 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. అడివిలింగాల సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యాన్ని టాస్ నిర్ణయించింది. సర్పంచ్ అభ్యర్థులు మంగళి సంతోష్‌కుమార్, పెంట మానయ్యలకు చెరో 483 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ ద్వారా సర్పంచ్‌ను ఎంపిక చేశారు. టాస్‌లో మంగళి సంతోష్‌కుమార్‌ను అదృష్టం వరించింది.
మహ్మద్‌నగర్‌లో 13 పంచాయతీలుండగా ఒకటి ఏకగ్రీవమయ్యింది. 12 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. తొమ్మిది చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, రెండు గ్రామాల్లో బీఆర్‌ఎస్, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. నిజాంసాగర్ మండలంలో 14 పంచాయతీలకు గాను ఒకటి ఏకగ్రీవమైంది. 13 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఏడు గ్రామాల్లో కాంగ్రెస్, నాలుగు గ్రామాల్లో బీఆర్‌ఎస్, ఒకచోట బీజేపీ, మరోచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పిట్లం మండలంలో 26 పంచాయతీలకుగాను ఒకటి ఏకగ్రీవమైంది. 25 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 19 చోట్ల కాంగ్రెస్, నాలుగు గ్రామాల్లో బీఆర్‌ఎస్, రెండు పంచాయతీలలో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు.
పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. మలి విడతలోనూ ఆ పార్టీనే అత్యధిక స్థానాలను గెలుచుకుంది. బీఆర్‌ఎస్ పోటీ ఇచ్చింది. బీజేపీ నామమాత్రంగానే జీపీలను గెలుచుకుంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
కాంగ్రెస్ జోరు..
కాంగ్రెస్ జోరు..
కాంగ్రెస్ జోరు..


