మలి దశకు రెడీ
పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది
మండల కేంద్రాల్లో హోరాహోరీ..
● నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు
● 153 సర్పంచ్, 873 వార్డులకు పోలింగ్
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
జిల్లాలోని లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం, మహమ్మద్‌నగర్ మండలాలలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా మండలాల పరిధిలో 197 పంచాయతీలు, 1654 వార్డులు ఉండగా, 44 సర్పంచ్ పదవులు, 776 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 153 సర్పంచ్ పదవులకు 606 మంది, 873 వార్డులకు 2,655 మంది పోటీ పడుతున్నారు. 1,89,177 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఆయా పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మొదట వార్డు సభ్యుల ఓట్లు లెక్కించిన తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. మొదటి విడతలో పలు మేజర్ పంచాయతీల్లో అర్ధరాత్రి దాటిన తర్వాతే కౌంటింగ్ పూర్తయ్యింది. ఈసారి కౌంటింగ్‌లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
మలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరింది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఏడు మండలాల పరిధిలోని 153 సర్పంచ్, 873 వార్డు స్థానాలలో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
ఆయా మండల కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, సామగ్రితో శనివారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆయా మండలాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు వెళ్లి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. సిబ్బందికి అవసమరైన రవాణా, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ఎక్కడా లోపం జరగకూడదని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
వారం, పది రోజులపాటు అభ్యర్థులు, వారి తరఫున ఆయా రాజకీయ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో పోటాపోటీగా ఖర్చు చేశారు. ఊరూరా కుల సంఘాలకు విందులు ఇచ్చారు. చివరి రెండు రోజుల్లో పంపకాలు జరిగాయన్న ప్రచారం ఉంది. ప్రధానంగా పెద్ద పంచాయతీలైన గాంధారి, లింగంపేట, పిట్లం మండల కేంద్రాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గెలుపుకోసం భారీ ఎత్తున ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మూడు గ్రామాలు కూడా పెద్దవి కావడంతో అక్కడ తీవ్ర పోటీ నెలకొంది. ఆదివారం పోలింగ్ జరిగే స్థానాల్లో పలుచోట్ల ద్విముఖ, కొన్నిచోట్ల త్రిముఖ పోటీ నడుస్తోంది. పోటీలో ఉన్న వారి తరఫున ఆయా పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. పిట్లం, మహమ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే విస్తృతంగా తమ పార్టీ మద్దతుదారుల తరఫున ప్రచారం చేశారు. అలాగే ఆయా మండలాల్లోని పెద్ద గ్రామాల్లో సర్పంచ్ పదవితో పాటు వార్డుల్లోనూ గట్టి పోటీ నెలకొంది. చాలా చోట్ల ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారన్నది రాత్రి వరకు తేలిపోనుంది.
మలి దశకు రెడీ
మలి దశకు రెడీ
మలి దశకు రెడీ
మలి దశకు రెడీ


