ఏకగ్రీవం చేసి అన్యాయం చేశారు
కామారెడ్డి క్రైం: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసి తమ తండాకు అన్యాయం చేశారని గాంధారి మండలం సోమ్లానాయక్ తండా జీపీ పరిధిలోని పంతులు నాయక్ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారు కలెక్టరేట్‌కు తరలివచ్చి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. జీపీగా ఏర్పడిన తర్వాత 2019 లో ఓట్లు ఎక్కువగా ఉన్న సోమ్లానాయక్ తండా పెద్దలు కలిసి సర్పంచ్ స్థానాన్ని ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేశారన్నారు. తాజా ఎన్నికల్లో తమ గ్రామం నుంచి ఒక నామినేషన్ వేయించామన్నారు. మద్యం, డబ్బులతో మభ్యపెట్టి అతడిని విత్‌డ్రా చేయించారని ఆరోపించారు. ఏవైనా సమస్యలు, నిధుల వినియోగంపై జీపీకి వెళ్లి అడిగితే తమ తండా ప్రజల ఓట్లు తక్కువగా ఉన్నాయనే భావనతో చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల నాటికి పంతులు నాయక్ తండాను గతంలో మాదిరిగా బూర్గుల్ జీపీలో కలపాలని, లేదా ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం కొందరు ఇతరులను మభ్యపెట్టి చేసిన ఏకగ్రీవాన్ని రద్దు చేయాలని, తిరిగి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎన్నికల నోడల్ అధికారి సతీశ్ యాదవ్‌కు వినతిపత్రం ఇచ్చారు.


