ఎన్నికల వేళ కొత్త ‘పంచాయితీ’
సోమ్లానాయక్ తండాలోనూ ఇదే పరిస్థితి..
ప్రభుత్వం పాలనను చేరువ చేసేందుకు 2018లో పంచాయతీల పునర్విభజన చేపట్టింది. 500 జనాభాకు మించి ఉన్న గ్రామాలు, తండాలను గ్రామపంచాయతీలుగా చేసింది. చిన్నచిన్న తండాలు, పల్లెలలో రెండు మూడింటిని కలిపి నూతన పంచాయతీలుగా మార్చింది. పంచాయతీల పునర్విభజనతో తమకు ప్రజాప్రతినిధులుగా అవకాశాలు దక్కుతాయని చాలామంది ఆశించారు. అయితే చిన్న పెద్ద తండాలు, ఆవాసాల మధ్య వివాదాలు తలెత్తుతుండడంతో చిన్న ఆవాసాల ప్రజలు తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పల్లెను కూడా గ్రామ పంచాయితీగా గుర్తించాలనే డిమాండ్ పెరుగుతోంది.
గోకుల్ తండాలో ఓట్ల బహిష్కరణ
రామారెడ్డి మండలంలోని గోకుల్ తండా పరిధిలో మీది తండా, కింది తండా ఉన్నాయి. మీది తండాలో 350, కింది తండాలో 250 మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువగా ఉన్న మీది తండావాసులు తమ తండాకు చెందిన వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకుని ఏకగ్రీవం చేసుకున్నారు. ఈసారి కూడా అలాగే చేస్తున్నారని ఆరోపిస్తూ కింది తండావాసులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఉన్నతాధికారులు వెళ్లి మాట్లాడినా ఫలితం లేకపోయింది.
జనగణన తర్వాతే అవకాశం!
కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాలంటే అసెంబ్లీ తీర్మానం పూర్తయి ప్రభుత్వం నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. 2018 లో అప్పటి ప్రభుత్వం 500 జనాభాకు మించి ఉన్న (2011 జనాభా లెక్కల ప్రకారం) గ్రామాలు, తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా గుర్తించింది. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 65 గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. పాత వాటితో కలిపి కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో 2019 లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పట్లో పంచాయతీల పునర్విభజనకు అవకాశం లేదని తెలుస్తోంది. 2026–27 లో జనగణన చేపట్టనున్నారు. దీనిని బట్టి చూస్తే 2027 చివరికి జనాభా గణన పూర్తయితే కొత్త జనాభా లెక్కల ప్రకారం 500 జనాభా దాటిన పంచాయతీలు, గ్రామాలు, తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
గాంధారి మండలం సోమ్లానాయక్ తండాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 2018లో సోమ్లానాయక్ తండా పంచాయతీగా ఏర్పడింది. దీని పరిధిలో తక్కువ ఓటర్లు కలిగిన పంతులు నాయక్ తండా ఉంది. సోమ్లానాయక్ తండావాసులు ఏకగ్రీవాలు చేసుకుంటూ తమకు సర్పంచ్ అవకాశం ఇవ్వడం లేదని పంతులు నాయక్ తండావాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశామని పేర్కొంటున్నారు. ఇవే కాకుండా 2018 లో ఏర్పడిన పంచాయతీల పరిధిలోని పలు హాబిటేషన్‌లలో ఇలాంటి సమస్యలున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఎక్కువగా ఉన్న పంచాయతీ కేంద్రాల ప్రజలు, నాయకులు తమను పట్టించుకోవడం లేదని హాబిటేషన్‌ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామాలకు అన్యాయం జరుగుతోందనే వాదన కొన్ని హ్యాబిటేషన్‌ల నుంచి వినిపిస్తోంది.
పంచాయతీ ఎన్నికల వేళ కొత్త సమస్య తలెత్తింది. రెండుమూడు పల్లెలు కలిసి ఏర్పాటైన జీపీలలో తమకు సర్పంచ్ అవకాశం రావడం లేదని చిన్న పల్లెలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. – కామారెడ్డి క్రైం
ఆవాసాలు, పంచాయతీ
కేంద్రాల మధ్య వివాదాలు
తమకు సర్పంచ్ అవకాశాలు
రావడం లేదని ఆవేదన
ప్రత్యేక జీపీలుగా ఏర్పాటు
చేయాలని డిమాండ్


