తిప్పాపూర్‌లో ‘కత్తెర’ హ్యాట్రిక్!
● వరుసగా మూడుసార్లు
ఈ గుర్తు అభ్యర్థులదే విజయం
భిక్కనూరు: తిప్పాపూర్ గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసిన అభ్యర్థులకు కత్తెర గుర్తు కలిసివస్తోంది. వరుసగా మూడు ఎన్నికలలోనూ ఈ గుర్తు వచ్చినవారే విజయ తీరాలకు చేరడం గమనార్హం. 2013లో తిప్పాపూర్ సర్పంచ్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తాటిపల్లి జమున పోటీ చేశారు. కత్తెర గుర్తుపై పోటీ చేసిన ఆమె గెలుపొందారు. 2019 సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ జనరల్ అయ్యింది. కోక స్వామి కాంగ్రెస్ మద్దతుతో కత్తెర గురుపై పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికలలో ఈ స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన కుంట లింగారెడ్డికి కత్తెర గుర్తు వచ్చింది. ఆయన తన సమీప ప్రత్యర్థి రాజయ్యపై 59 ఓట్ల వ్యత్యాసంతో గెలిచారు. వరుసగా మూడు పర్యాయాలు కత్తెర గుర్తుపై పోటీ చేసినవారే గెలుపొందడం మండలంలో చర్చనీయాంశమైంది.


