పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
● ఓట్ల లెక్కింపు ఆలస్యం కాకుండా చూడండి
● ఎన్నికల సిబ్బందితో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
నిజాంసాగర్/ఎల్లారెడ్డి/లింగంపేట: ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఎన్నికల సిబ్బందికి సూచించారు. శనివారం ఆయన ఎల్లారెడ్డి, లింగంపేట, నిజాంసాగర్ మండల కేంద్రాలలోని ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడతలో ఏడు మండలాల పరిధిలోని 153 సర్పంచ్, 873 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయమే మాక్ పోలింగ్ నిర్వహించాలని, 7 గంటలకు తప్పనిసరిగా పోలింగ్ ప్రారంభించాలని సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు వేసేందుకు క్యూలైన్‌లో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి పోలింగ్ కంటిన్యూ చేయాలన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టాలని, మేజర్ గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ఆలస్యం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శీతాకాలం నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, బస్ సౌకర్యాం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమాలలో సబ్‌కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు శివకృష్ణ, భిక్షపతి, రూట్ అధికారులు అమర్‌ప్రసాద్, తిరుపతిరెడ్డి, ఎల్లారెడ్డి ఎంపీడీవో తాహేరాబేగం, ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ తదితరులున్నారు.


