అంబారిపేట శివారులో చిరుత సంచారం
● రెండు దూడలపై దాడి
● భయాందోళనల్లో గ్రామస్తులు
దోమకొండ: అంబారిపేట గ్రామ శివారులో ఆదివారం చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతులు రంగోల్ స్వామిగౌడ్, బంజారా ప్రవీణ్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేసరికి రెండు దూడలు మృతిచెంది ఉన్నాయి. చిరుత దాడిచేసి చంపేసి ఉంటుందని భావించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించారు. పెద్ద సైజులో పాదముద్రలు ఉన్నట్లు గుర్తించామని మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేశ్ తెలిపారు. మగ చిరుతపులి లేదా పులి సైజులో పాద ముద్రలు ఉన్నాయన్నారు. ఇక్కడి ప్రాంతంలో పులి సంచరించే అవకాశాలు తక్కువగా ఉన్నందున మగ చిరుతపులివే అయి ఉంటాయని భావిస్తున్నామన్నారు. అంబారిపేట, ఫరీదుపేట ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు ఒంటరిగా వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎంఏ పారూఖ్, బీట్ ఆఫీసర్ పద్మ, సర్పంచ్ అరుట్ల కవిత తదితరులున్నారు.
అంబారిపేట శివారులో చిరుత సంచారం


