నాడు ఓటమి.. నేడు గెలుపు
నిజాంసాగర్: మహ్మద్‌నగర్ మండలం హసన్‌పల్లి గ్రామ సర్పంచ్ పదవి కోసం బోయిని హరిన్‌కుమార్, సంగమేశ్వర్ గౌడ్ పోటీ చేశారు. ఈ ఎన్నికలలో హరిన్‌కుమార్ తన ప్రత్యర్థిపై 261 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాగా గత ఎన్నికల్లోనూ వీరిద్దరే ప్రత్యర్థులు కావడం గమనార్హం. నాటి ఎన్నికలలో హరిన్‌కుమార్‌పై సంగమేశ్వర్ గౌడ్ గెలిచారు.
నిజాంసాగర్: మహమ్మద్‌నగర్ మండలం కోమలంచ గ్రామానికి చెందిన బండారి లక్ష్మి గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించారు. ఆమె 2019లో ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి ఐదేళ్లపాటు ఎంపీటీసీగా సేవలందించారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగియగా.. ఇక చివరి విడతకు సంబంధించి ప్రచార పర్వం సోమవారంతో ముగియనుంది. ఆయా స్థానాలకు ఈనెల 17న పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లాలో చివరి విడతలో బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్‌గల్ మండలాల పరిధిలోని 168 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 26 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 1,482 వార్డులకుగాను 4 వందల వార్డులకు సింగిల్ నామినేషనే దాఖలయ్యింది. మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థులు గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం సోమవారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పలువురు అభ్యర్థులు ర్యాలీలు తీయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
బీఎన్‌ఎస్ సెక్షన్ 163 అమలు..
పోలింగ్ జరగనున్న గ్రామాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) 163 సెక్షన్ అమలులో ఉండనుంది. 17వ తేదీన కౌంటింగ్ పూర్తై విజేతలను ప్రకటించే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో కల్లు, మద్యం దుకాణాలు మూసి ఉంటాయని పేర్కొన్నారు.


