
‘ప్రాజెక్ట్ రీబర్త్’తో విమాన ప్రమాదాలకు చెక్
తొలి ‘ఏఐ ఆధారిత ప్రమాద నిరోధక వ్యవస్థ’
రూపొందించిన ఇద్దరు భారతీయ విద్యార్థులు
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదమే స్ఫూర్తి
తల్లి ఆవేదనతో చలించి ఆవిష్కరణకు శ్రీకారం
విమానం గాల్లో వెళ్తోంది. హఠాత్తుగా విమానంలో సమస్య తలెత్తింది. పైలట్లు ఇక విమానం నడపడం మావల్ల కాదని చేతులెత్తేశారు. అప్పుడు కనీవినీ ఎరగని రీతిలో విమానానికి ఎయిర్ బ్యాగులు ప్రత్యక్షమయ్యాయి. విమానం సురక్షితంగా కిందకు దిగింది. భారీ ప్రమాదం తప్పింది. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలా జరిగితే ఎంత బాగుంటుంది! ఈ దిశగా ఇప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయి. బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌కి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థుల ఆలోచన ఇది.
ప్రాజెక్ట్ రీబర్త్ (Project REBIRTH) ఏఐ సాయంతో విమానాలకు ఎయిర్‌బ్యాగులు (Airbags) ఏర్పాటుచేసే వినూత్న ఆవిష్కరణ. దుబాయ్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులైన ఈషెల్ వసీం, దర్శన్ శ్రీనివాసన్ దీన్ని రూపొందించారు. ఈ ఎయిర్‌బ్యాగుల ఆలోచన.. ల్యాబులోనో, క్లాస్‌రూములోనో రాలేదు. ఇది ఒక మాతృమూర్తి ఆవేదన, సానుభూతి నుంచి వచ్చింది.
అమ్మ బాధ తెలుసుకుని..
జూన్ 12, 2025.. దేశం మొత్తం ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. 260 మంది ప్రాణాలు కోల్పోయారు. తమ ఆప్తుల మృతదేహాలు కూడా దొరకని వారి కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం. అదిగో అది.. ఓ తల్లిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆమె.. దుబాయ్‌లోని బిట్స్‌పిలానీలో చదువుతున్న ఈషెల్ తల్లి. ‘విమాన ప్రమాదం గురించి విన్న మా అమ్మ తీవ్రంగా కలత చెందింది. ఆమెకు నిద్ర కూడా పట్టేది కాదు.
‘‘ప్రమాదం తప్పదు.. ఇక విమానాన్ని, ప్రయాణికుల ప్రాణాలు కాపాడలేం’ అనుకున్న క్షణంలో పైలట్లు ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటారు’’ అనుకుంది. అలాగే తమ ప్రాణాలు పోవడం ఖాయం అనుకున్న ప్రయాణికుల మానసిక స్థితి ఎలా ఉండి ఉంటుందో అని రోజూ ఆలోచించేది. ఆమె ఆవేదనే నన్ను ఆలోచింపజేసింది. నా స్నేహితుడు శ్రీనివాసన్‌తో ఈ విషయాన్ని పంచుకున్నాను. ఇలాంటి విమాన ప్రమాదాలు ఎలా ఆపవచ్చా అనుకున్నప్పుడు ఎయిర్‌బ్యాగుల ఆలోచన వచ్చింది’ అంటాడు వసీం.

క్షణాల్లో తెలిసిపోతుంది
సాధారణంగా విమాన ప్రమాదాలు (Flight Accidents) జరిగాక కొన్ని గంటలకో, రోజులకోగానీ ఎక్కడ జరిగిందో తెలియదు. ఈలోగా.. తీవ్ర గాయాలతో ఉన్నవారు ప్రాణాలు కోల్పోవచ్చు. మంటలు పెరిగి అంతా కాలి బూడిదైపోవచ్చు. ఏదైనా జరగొచ్చు. ఇలా జరగకుండా.. విమానం ఎక్కడ ఉందో తెలియజేసేందుకు జీపీఎస్, లైటింగ్ వ్యవస్థ ఇందులో ఉన్నాయి. అంటే.. క్షణాల్లో విమాన సమాచారం తెలిసిపోతుందనమాట!
పునర్జన్మకు వాగ్దానం
‘ప్రస్తుతం రీబర్త్ టెస్టింగ్‌కి సిద్ధంగా ఉంది. పైలట్లతో సంబంధం లేకుండానే.. విమానం ఎప్పుడు కుప్పకూలిపోవచ్చో ఏఐ వ్యవస్థ కచ్చితంగా అంచనా వేయడం దీని ప్రత్యేకత. విమానానికి బయట నుంచి వచ్చి, ప్రమాదం నుంచి కాపాడే ఎయిర్‌బ్యాగులు అసలైన రక్షణ వ్యవస్థ. ముఖ్యంగా లోపల ఉన్న ప్రయాణికులు తీవ్రమైన కుదుపులకు గురికాకుండా, ఎలాంటి గాయాలు కూడా కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశాం. ఈ మొత్తం వ్యవస్థను కొత్త విమానాల్లోనే కాదు, ఇప్పటికే ఉన్న విమానాల్లోనూ ఏర్పాటుచేయవచ్చు. రీబర్త్ అనేది కేవలం ఆవిష్కరణ కాదు.. అన్నీ విఫలమైపోయి ప్రాణాలు పోవడం ఖాయం అనుకున్నప్పుడు కూడా పునర్జన్మనిస్తుందనే వాగ్దానం’ అంటున్నారు వసీం, శ్రీనివాసన్.
5 ఏళ్లలో సిద్ధం!
రీబర్త్‌కు సంబంధించిన ప్రధాన భాగాల తయారీపైనా ఈ యువ ఇంజినీర్లు దృష్టిపెట్టారు. ముఖ్యంగా ప్రమాదాన్ని పసిగట్టే ఏఐ వ్యవస్థ, ఎయిర్‌బ్యాగులు, స్మార్ట్ సీట్ల వంటి అన్ని రకాల సాంకేతికతలనూ తయారుచేసేందుకు విమాన తయారీ సంస్థలు, ప్రభుత్వాలతో వీరు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లలో.. రీబర్త్‌ను పరీక్షించి, అన్ని అనుమతులూ పొంది, విమానాల్లో పూర్తిస్థాయిలో వాడాలన్నది తమ లక్ష్యం అంటున్నారు ఈ యువ ఆవిష్కర్తలు.
చదవండి: ప్రపంచవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులసైబర్ ఎటాక్
‘ఏఐ’ రక్షణ వ్యవస్థ
ఇది మొట్టమొదటి ఏఐ ఆధారిత ప్రమాద నిరోధక వ్యవస్థ. 5 స్మార్ట్ టెక్నాలజీల సాయంతో విమాన ప్రమాదాలను పసిగడుతుంది.
⇒ ఇందులోని ఏఐ వ్యవస్థ.. ఎత్తు, వేగం, ఇంజిన్ పరిస్థితి, దిశ, మంటలు, పైలట్ల స్పందనలను పర్యవేక్షిస్తుంది.
⇒ విమానం కుప్పకూలిపోతుంది అనుకున్నప్పుడు ‘ప్రాజెక్ట్ రీబర్త్’ యాక్టివేట్ అవుతుంది. హైస్పీడ్ ఎయిర్‌బ్యాగులు విమానం రెక్కలు, కింది భాగం, వెనుక భాగాల నుంచి కేవలం 2 సెకెన్ల వ్యవధిలో వచ్చేస్తాయి.
⇒ విమాన వేగం తగ్గేలా సాంకేతిక ఏర్పాటు ఉంది.
⇒ సాధారణంగా విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదాలుగా మారేది తాకిడి తీవ్రత వల్లే. అందువల్ల రీబర్త్‌లో ప్రధానంగా దీన్ని తగ్గించడంపైనే దృష్టి పెట్టారు. విమాన వేగం తగ్గి, దేన్నయినా బలంగా కాకుండా, నెమ్మదిగా తాకినప్పుడు.. లేదా వేగంగా కాకుండా నెమ్మదిగా ల్యాండింగ్ అయినప్పుడు ప్రమాదం తప్పినట్టే కదా.