
ప్రపంచవ్యాప్తంగా పలు విమానాశ్రయాలపై సైబర్ దాడులు జరిగాయి. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం.. లండన్ హీత్రో, బ్రస్సెల్స్(బెల్జియం)తో పాటు యూరప్ దేశాల్లోనే విమానాశ్రయాలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.
కోలిన్స్ ఎయిరోస్పేస్(Collins Aerospace) అనే సంస్థ నిర్వహించే చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్స్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. హీత్రో విమానాశ్రయంలో విమాన ప్రయాణాలు ఆలస్యం కాగా, బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ఆటోమేటెడ్ సేవలు నిలిచిపోవడంతో మాన్యువల్‌గా చెక్ ఇన్ నిర్వహిస్తున్నారు. సైబర్ దాడి జరిగిన విషయాన్ని బెర్లిన్(జర్మనీ) విమానాశ్రయం కూడా తన వెబ్‌సైట్‌లో అధికారికంగా ప్రకటించింది. అయితే, ఫ్రాంక్‌ఫర్ట్, జ్యూరిచ్ విమానాశ్రయాలు ఈ దాడి నుంచి తప్పించుకున్నాయి.
సైబర్ దాడి ప్రభావంతో యూరప్ దేశాల విమానాశ్రాయాల్లో అలజడి నెలకొంది. ఈ ప్రభావంతో వేల మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. వందల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలను రద్దు చేశారు.
అమెరికా అధ్యక్షుడు హెచ్-1బీ వీసాల దరఖాస్తు రుసుమును అమెరికా లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు ఫుల్ బిజీగా మారాయి. ఈ క్రమంలోనే ఈ సైబర్ దాడి జరగడం గమనార్హం.