breaking news
Brussels airport
-
ప్రపంచవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులపై సైబర్ ఎటాక్!
ప్రపంచవ్యాప్తంగా పలు విమానాశ్రయాలపై సైబర్ దాడులు జరిగాయి. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం.. లండన్ హీత్రో, బ్రస్సెల్స్(బెల్జియం)తో పాటు యూరప్ దేశాల్లోనే విమానాశ్రయాలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. కోలిన్స్ ఎయిరోస్పేస్(Collins Aerospace) అనే సంస్థ నిర్వహించే చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్స్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. హీత్రో విమానాశ్రయంలో విమాన ప్రయాణాలు ఆలస్యం కాగా, బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ఆటోమేటెడ్ సేవలు నిలిచిపోవడంతో మాన్యువల్‌గా చెక్ ఇన్ నిర్వహిస్తున్నారు. సైబర్ దాడి జరిగిన విషయాన్ని బెర్లిన్(జర్మనీ) విమానాశ్రయం కూడా తన వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించింది. అయితే, ఫ్రాంక్ఫర్ట్, జ్యూరిచ్ విమానాశ్రయాలు ఈ దాడి నుంచి తప్పించుకున్నాయి.సైబర్ దాడి ప్రభావంతో యూరప్ దేశాల విమానాశ్రాయాల్లో అలజడి నెలకొంది. ఈ ప్రభావంతో వేల మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. వందల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలను రద్దు చేశారు. అమెరికా అధ్యక్షుడు హెచ్-1బీ వీసాల దరఖాస్తు రుసుమును అమెరికా లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు ఫుల్ బిజీగా మారాయి. ఈ క్రమంలోనే ఈ సైబర్ దాడి జరగడం గమనార్హం. -
బ్రస్సెల్స్ లో మా ఆయన క్షేమం: హీరోయిన్
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ విమానం కెప్టెన్ అయిన తన భర్త బ్రస్సెల్స్ లో క్షేమంగా ఉన్నాడని బాలీవుడ్ హీరోయిన్ గుల్ పనాగ్ తెలిపింది. జెట్ ఎయిర్ వేస్ విమానం బెల్జియం రాజధాని బ్రసెల్స్ విమానాశ్రయంలో ల్యాండైన కొద్దిసేపటికే ఆత్మాహుతి దాడులు కుదిపేశాయి. విమానాశ్రయంలో హాహాకారాలు, ఆర్తనాదాలతో భీతావహ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బ్రసెల్స్ లో దిగిన జెట్ ఎయిర్వేస్ సిబ్బంది, ప్రయాణికులు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని గుల్ పనాగ్ ట్విట్టర్ లో తెలిపింది. తన భర్త, జెట్ ఎయిర్వేస్ కెప్టెన్ జీఎస్ అట్టారీ విమానంలో ఉన్నారని ఆమె వెల్లడించింది. 'బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ప్రస్తుతం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతున్నది. భద్రతా సిబ్బంది ఇప్పటికీ బాంబులను కనుగొంటున్నారు. మా ఆయన, విమాన సిబ్బంది, ప్రయాణికులు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. అక్కడి వివరాలను ఎప్పటికప్పుడు మా ఆయన ద్వారా తెలుసుకొని ట్విట్టర్ లో షేర్ చేస్తున్నాను. దీనివల్ల విమానం సిబ్బంది, ప్రయాణికుల కుటుంబసభ్యులకు తమ వారి భద్రత గురించి తెలుసుకుంటారు' అని ఆమె మీడియాతో పేర్కొంది. 'ప్రయాణికులు, సిబ్బంది అంతా విమానంలోనే ఉన్నారు. వారి విమానం సురక్షిత ప్రదేశంలో ఉంది. ప్రతి గంటకు మా ఆయన తాజా సమాచారం అందిస్తున్నారు' అని ఆమె తాజాగా ట్వీట్ చేశారు. న్యూఢిల్లీ నుంచి బ్రస్సెల్స్ వెళ్లిన జెట్ ఎయిర్వేస్ సిబ్బందిని, ప్రయాణికులను విమానం నుంచి ప్రస్తుతం దింపి.. పంపించివేశారని మరో ట్వీట్ లో వెల్లడించారు.