భారత్‌లోని అమెరికా ఎంబసీ హెచ్చరిక
న్యూఢిల్లీ: వలసదారులకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మరో హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని తేల్చిచెప్పింది. క్రిమినల్ నేరాల కింద శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు యూఎస్ ఎంబసీ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
‘‘చట్టాలను గౌరవించకపోయినా, ఉల్లంఘించినట్లు తేలినా కఠిన చర్యలు తప్పవు. క్రిమినల్ నేరాలుగా పరిగణించి శిక్ష విధిస్తారు. అక్రమ వలసలను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. దేశ సరిహద్దులను, పౌరులను రక్షించుకోవాలన్నదే ప్రభుత్వ ధ్యేయం’’అని స్పష్టంచేసింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ పోస్టు చేయడం గమనార్హం. వలసదారులపై ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
వీసా నిబంధనలు మార్చేసింది. ప్రధానంగా హెచ్–1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచేసింది. మరోవైపు హెచ్–1బీ వీసా ఇంటర్వ్యూలను హఠాత్తుగా వాయిదా వేయడంతో వేలాది మంది భారతీయ వృత్తినిపుణులు స్వదేశానికే పరిమితయ్యారు. ఇంటర్వ్యూ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను, పోస్టులను అమెరికా అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
ఇలాంటి సమయంలో చట్టాలను ఉల్లంఘించవద్దంటూ అమెరికా ఎంబసీ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. ట్రంప్ ప్రభుత్వం వారిపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈ ఏడాది 6.05 లక్షల మందిని బలవంతంగా బయటకు పంపించింది. అక్రమ వలసదారులను గుర్తించే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలామందిని అమెరికా నుంచి వెళ్లగొట్టడం తథ్యమని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు.


