రుసుము పెంచే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు ఉంది
యూఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి బెరిల్ హోవెల్ తీర్పు
వాషింగ్టన్: అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజును డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏకంగా లక్ష డాలర్లకు పెంచడడానికి వ్యతిరేకంగా సాగిస్తున్న న్యాయ పోరాటానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధమేనని కొలంబియా జిల్లాకు చెందిన యూఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి బెరిల్ హోవెల్ తేల్చిచెప్పారు. ఈ మేరకు డిసెంబర్ 23న ఉత్తర్వు జారీ చేసింది.
వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచడాన్ని సవాలు చేస్తూ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్‌లో యూఎస్ జిల్లా కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ నిర్ణయంలోని చట్టబద్ధతను ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తి బెరిల్ హోవెల్ విచారణ చేపట్టారు. రుసుమును విపరీతంగా పెంచేయడం ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చాంబర్ ఆఫ్ కామర్స్ వాదించింది.
వీసా ఫీజును నిర్ణయించే విషయంలో కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌కు ఉన్న అధికారాన్ని సైతం ట్రంప్ ప్రభుత్వం అతిక్రమించినట్లు పేర్కొంది. ఫీజను తగ్గించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. అయితే, ఈ వాదనను బెరిల్ హోవెల్ తిరస్కరించారు. అధ్యక్షుడు ట్రంప్ చట్టప్రకారమే నడుచుకున్నారని, వీసా ఫీజు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఆయనకు ఉందని న్యాయమూర్తి స్పష్టంచేశారు.
బెరిల్ హోవెల్ గతంలో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒమాబా నియమించిన న్యాయవాది కావడం విశేషం. మరోవైపు జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ యూఎస్ చాంబర్ కామర్స్.. అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. నోటీసు ఆఫ్ అప్పీల్స్‌ను దాఖలు చేసింది. జిల్లా కోర్టు ఇచి్చన తీర్పును నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై త్వరలోనే అప్పీల్స్ కోర్టులో విచారణ జరుగనుంది.
హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజు విషయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయ పోరాటం ఫలించడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. చివరకు ఈ వ్యవహారం అమెరికా సుప్రీంకోర్టుకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్–1బీ వీసాల కోసం అమెరికా వృత్తి నిపుణుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది.
మొత్తం వీసాల్లో దాదాపు 70 శాతం వీసాలను భారతీయులే దక్కించుకుంటున్నారు. వీసా ఫీజు లక్ష డాలర్లకు(రూ.89.86 లక్షలు) చేరడం అమెరికా కంపెనీలకు పెనుభారంగా మారింది. ఈ ఖర్చు భరించలేక విదేశీ నిపుణులను నియమించుకొనే ప్రక్రియను కంపెనీలు వాయిదా వేస్తున్నారు. అంతిమంగా విదేశీ వృత్తి నిపుణులే నష్టపోతున్నారు.


