రూ.950 కోట్ల విలువైన బంగారం, నగలు, కరెన్సీ కొట్టేసిన దొంగలు
పశ్చిమ జర్మనీలో ఘటన
వాళ్లను పట్టుకునేందుకు వేట మొదలెట్టిన పోలీసులు
అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన వేళ జర్మనీలో చోరశిఖామణులు వందల కోట్ల విలువైన సంపదపై పక్కా ప్రణాళికతో నింపాదిగా కొట్టేశారు. ఏమాత్రం హడావిడి పడకుండా నెమ్మదిగా పని ముగించి ఏకంగా దాదాపు రూ.950 కోట్ల విలువైన కట్టల కొద్దీ కరెన్సీ, కేజీల కొద్దీ బంగారం, ఆభరణాలను వెంట తీసుకెళ్లారు.
ఈ చోరీ కోసం దొంగలు భారీ డ్రిల్లింగ్ మెషీన్‌ను రంగంలోకి దింపారు. అత్యంత దృఢమైన బ్యాంక్ వాల్ట్ గోడకు కన్నమేసి వేలాది మంది బ్యాంక్ వినియోగదారుల విలువైన వస్తువులను తమ వశంచేసుకున్నారు. ఉత్తర రైనీ–వెస్ట్‌ఫాలియా రాష్ట్రంలోని గెల్సెన్‌కిర్చెన్ నగరంలోని స్పార్కసీ సేవింగ్ బ్యాంక్ శాఖలో ఈ భారీ చోరీ జరిగింది.
సెలవు రోజుల్లో పక్కా ప్రణాళికతో
గెల్సెన్‌కిర్చెన్: జర్మనీలో క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా బ్యాంక్‌లు సహా పలు రకాల సంస్థలకు సెలవులు ప్రకటిస్తారు. డిసెంబర్ 24 తేదీ నుంచి బ్యాంక్ శాఖలకు తాళాలే వేసి ఉన్నాయి. అటు వైపు కన్నెత్తిచూసే పోలీస్‌నాథుడే ఉండడు. ఇదే సమయాన్ని దొంగలు తమకు అనువుగా మల్చుకుని విజయం సాధించారు. ఈ స్పార్కసీ సేవింగ్ బ్యాంక్ శాఖలో వందల కోట్ల విలువైన నగలు, బంగారం, కరెన్సీ మూటలను బ్యాంక్ అధికారులు భూగర్భంలోని అత్యంత సురక్షితమైన వాలెట్‌లోనే భద్రపరుస్తారు.
ఈ విషయం తెల్సుకున్న దొంగలు తొలుత ఈ బ్యాంక్ బ్రాంచ్ భవంతిని ఆనుకుని ఉన్న ఒక పార్కింగ్ గ్యారేజీలోకి చొరబడ్డారు. గ్యారేజీ గోడలతో అనుసంధానమైన బ్యాంక్ వాలెట్ గోడ సరిగ్గా ఎక్కడుందో కనిపెట్టారు. పెద్దపెద్ద రంధ్రాలు చేసే అత్యంత శక్తివంతమైన డ్రిల్లింగ్ మెషీన్‌తో గోడకు రంధ్రం చేశారు. లోపలికి చొరబడి బ్యాంక్ వినియోగదారులకు చెందిన దాదాపు 3,250 లాకర్లను తెరచి వాటిలోని బంగారు ఆభరణాలు, బంగారం కడ్డీలు, కరెన్సీని వెంట తెచ్చుకున్న సంచుల్లోకి నింపారు. ఈ చోరీపై పోలీస్ శాఖ అధికార ప్రతినిధి థామస్ నొవాక్జిక్ మాట్లాడారు.
‘‘దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే ఇందులో అత్యంత నిపుణులైన ఘరానా దొంగలు పాల్గొనట్లు తెలుస్తోంది. ఇంత పకడ్బందీగా చోరీ చేయడం ఈ మధ్యకాలంలో చూడలేదు. జర్మనీ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంక్ చోరీ ఘటన ఇదేనేమో. దాదాపు రూ.950 కోట్ల సంపద పోయిందని భావిస్తున్నాం. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో చోరీ జరగలేదు. నింపాదిగా ఒక్కో లాకర్‌ను బద్దలుకొట్టారు. వాలెట్‌లోని దాదాపు 95 శాతం లాకర్లలోని విలువైన వస్తువులు గల్లంతయ్యాయి. ఘటనపై ముమ్మర దర్యాప్తు మొదలెట్టాం. ఇప్పటిదాకా ఎవరినీ అరెస్ట్‌చేయలేదు. అత్యంత ప్రతిభావంతులైన డిటెక్టివ్, పోలీస్ బృందాలతో దొంగల వేట ఆరంభించాం’’అని ఆయన చెప్పారు.
తెల్లారిందాకా మోశారు!
దొంగలను సంపదను సంచుల్లో నింపుకున్నాక ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము దాకా ఒక్కోటిగా బయటకు తీసుకొచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ‘‘వాళ్లంతా బ్యాంక్ నుంచి రాలేదు. పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజీ నుంచి రావడంతో మాకు కొంచెం కూడా అనుమానం రాలేదు. అందరూ మాసు్కలు ధరించారు. మెట్ల మీద నుంచి బ్యాగులు మోస్తూ కని్పంచారు’’అని పొరుగు వాళ్లు చెప్పారు. సమీప సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తనిఖీచేశారు. అందులో నలుపు రంగు ఆడీ ఆర్‌ఎస్6 రకం కారు ఒకటి పార్కింగ్ గ్యారేజీ నుంచి బయటకు రావడం కనిపించింది.
ఆ కారులో ఉన్నవా ళ్లంతా ముసుగులో ధరించి ఉన్నారు. డీ–లా షెవలేరీ స్ట్రాసీ రోడ్డు గుండా కారులో దొంగలు పారిపోయారు. ఆ కారు లైసెన్స్ ప్లేటు పై పోలీసులు ఆరాతీయగా ఘటనాస్థలి నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని హనోవర్ సిటీలో చోరీకి గురైన కారుదిగా గుర్తించారు. ఈ మొత్తం ఘటన హాలీవుడ్‌లో హిట్ అయిన ‘ఓషన్స్ ఎలెవన్’నేరముఠా చోరీని గుర్తుకు తెస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో బ్యాంక్‌లోని ఒక అలారమ్ మోగడంతో అప్పుడు ఎమర్జెన్సీ బృందం రావడంతో చోరీ జరిగిన విషయం బయటపడింది.


