
భారత దేశ చరిత్రలో అహ్మదాబాద్ ఎయిరిండియా AI171 విమాన ప్రమాదంపై అత్యంత విషాదకరమైన ఘటనగా నిలిచింది. ఈ ఘటనపై అమెరికా న్యాయవాది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూన్ 12వ తేదీ మధ్యాహ్నా సమయంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం కొద్దిసెకన్లకే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 260 మంది మరణించారు. అందులో 229 మంది ప్రయాణికులు.. 12 మంది సిబ్బంది.. కింద ఉన్న మరో 19 మంది దుర్మరణం పాలయ్యారు.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సాయం అందడంలో జాప్యంపై అమెరికాకు చెందిన న్యాయవాది మైక్ ఆండ్రూస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాటా కంపెనీ మాజీ చైర్మన్, దివంగత రతన్ టాటా బతికి ఉండి ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నారాయన. రతన్ గనుక ఉండి ఉంటే.. బాధిత కుటుంబాలు ఇప్పుడు ఇంతగా ఇబ్బందులు ఎదుర్కొని ఉండేవి కావని అన్నారాయన.
ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో మైక్ ఆండ్రూస్ మాట్లాడుతూ.. ‘‘అమెరికాకు రతన్ టాటా అంటే ఏంటో తెలుసు. ఆయన నైతిక విలువలు, ఉద్యోగుల పట్ల ఆయన కనబరిచే శ్రద్ధ, వాళ్ల బాగోగుల గురించి ఆయన చేసే ఆలోచనలు.. వీటి గురించి అమెరికా ప్రజలకు కూడా కొంత తెలుసు. ఒకవేళ ఆయన గనుక ఇవాళ ఉండి ఉంటే.. ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. బాధితుల పట్ల దయగుణం కచ్చితంగా ప్రదర్శించేవారు’’ అని అన్నారాయన. ప్రమాదంలో మరణించిన 65 కుటుంబాల తరఫున పరిహారం కోసం ఆండ్రూస్ వాదనలు వినిపిస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక బాధిత కుటుంబం దీనావస్థను ప్రస్తావిస్తూ.. వయసుపైబడి మంచాన ఉన్న ఓ తల్లి ఒక్కగానొక్క కొడుకు సంపాదన మీదే ఆధారపడి బతుకుతోంది. అలాంటి కొడుకు ఎయిరిండియా ప్రమాదంలో మరణించాడు. ఆమెకు ఇప్పటిదాకా ఎలాంటి పరిహారం అందలేదు. మరి ఇప్పుడు ఆమె వైద్య ఖర్చులను ఎవరు చెల్లిస్తారు? ఆమె పరిస్థితి ఏంటి? అని ఆండ్రూస్ అంటున్నారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధిత కుటుంబాల కోసం ఓ ట్రస్ట్ నెలకొల్పి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని టాటా గ్రూప్స్ కు చెందిన ఎయిరిండియా ప్రతిజ్ఞ చేసింది. అలాగే ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌ను తిరిగి నిర్మిస్తామని పేర్కొంది. జులైలో.. తాత్కాలిక పరిహారం కింద రూ.25 లక్షలను ఎయిరిండియా విడుదల చేసింది. ఆ సొమ్మును 147 విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు, విమానం కూలడంతో నేల మీద మరణించి మరో 19 కుటుంబాలకు పరిహారంగా అందజేశారు. ఈ సొమ్మును తుది పరిహారంలో మినహాయిస్తామని కూడా ప్రకటించారు. అయితే పరిహారం అందడంలో జాప్యంతో.. బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు మెట్లు ఎక్కాయి.
2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా AI171 విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను కేంద్ర పౌరవిమాన మంత్రిత్వశాఖకు సమర్పించింది. అందులో..
• ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు టేకాఫ్ తర్వాత సెకన్ పాటు ఆగిపోయాయి, ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది.
• ఇంజిన్లు గాల్లోనే ఆగిపోవడం వల్ల విమానం కుప్పకూలింది.
• 32 సెకన్లలోనే విమానం క్రాష్‌ల్యాండ్ అయింది.

ఆ సమయంలో ఒక పైలట్ ఇంధనం ఎందుకు సిచ్ఛ్ ఆఫ్ చేశావని మరో పైలట్‌ను ప్రశ్నించాడు. నేను ఆఫ్ చేయలేదు అని సమాధానం ఇచ్చాడతను.
మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినా.. విమానం అప్పటికే కూలిపోయింది.
విమాన ప్రమాదానికి FADEC (Full Authority Digital Engine Control) సిస్టమ్‌లో లోపం కారణమైతే, బోయింగ్ కంపెనీపై అమెరికాలో ఉత్పత్తి బాధ్యత కేసు వేయవచ్చని లాయర్ మైక్ ఆండ్రూస్ తెలిపారు. అలాకాని పక్షంలో ఎయిరిండియాదే గనుక బాధ్యత అయితే.. మాంట్రియాల్ కన్వెన్షన్ ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. రెండూ ఉన్నట్లు గనుక తేలితే.. అప్పుడు పరిస్థితి కొంత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడ్డారయన.