దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత నాలుగు రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 5) ఒక్క రోజే 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. రద్దయిన అన్ని విమానాలకు ఆటోమేటిక్‌గా ఒరిజినల్ పేమెంట్ మోడ్‌కు పూర్తి రీఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. ఈనేపథ్యంలో అసలు ఈ సంక్షోభానికి కారణాలను మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.
సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్‌ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.
ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను, సిబ్బంది రోస్టర్‌ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.
సిబ్బంది కొరత
కొత్త FDTL నిబంధనల అమలుకు ముందు నుంచే ఇండిగో సంస్థలో పైలట్ల కొరత ఉందని విమర్శలు ఉన్నాయి. కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిసినప్పటికీ సంస్థ తగినంత మంది సిబ్బందిని ముందుగానే నియమించుకోవడంలో లేదా వారికి శిక్షణ ఇవ్వడంలో విఫలమైందని పైలట్ సంఘాలు ఆరోపించాయి. సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి సుదీర్ఘకాలంగా అనుసరించిన ‘లీన్ మ్యాన్‌పవర్ స్ట్రాటజీ’(తక్కువ సిబ్బందితో ఎక్కువ పనులు చేయించడం) ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందని కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం


