
డీజీసీఏ ఆడిట్‌లో వెల్లడైన లోపాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ విమానయాన సంస్థ ఎయిరిండియాలో దాదాపు 100 భద్రతా ఉల్లంఘనలు జరిగాయని భారత విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. ఎయిర్‌లైన్ గురుగ్రామ్ స్థావరంపై డీజీసీఏ ఈ నెల 1 నుంచి నాలుగువరకు ఆడిట్ నిర్వహించింది. కార్యకలాపాలు, విమాన షెడ్యూలింగ్, రోస్టరింగ్ మరియు ఇతర కీలక విధులను పరిశీలించింది. ఈ సందర్భంగా అనేక ఉల్లంఘనలు గుర్తించినట్లు డీజీసీఏ తెలిపింది.
విమానయాన సంస్థ సిబ్బంది శిక్షణ, విధులు, విశ్రాంతి కాల నిబంధనలు, సిబ్బంది సామర్థ్యం, ఎయిర్‌ఫీల్డ్ అర్హత వంటి అంశాల్లో నిబంధనలు పాటించలేదని తేలింది. వీటిలో ఏడు ఉల్లంఘనలను లెవల్–1గా వర్గీకరించారు. ఇవి తక్షణ దిద్దుబాటు చర్య అవసరమయ్యే తీవ్రమైన భద్రతా ప్రమాదాలుగా తెలిపింది. అంతేకాదు.. మార్పులకు అఉగుణంగా బోయింగ్ 787, 777 పైలట్లకు ఎయిరిండియా శిక్షణ ఇవ్వలేదని గుర్తించినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారనే విషయంపై నివేదికను సమరి్పంచాలని ఎయిరిండియాను ఆదేశించింది.
ఆడిట్ నివేదిక అందింది: ఎయిరిండియా
డీజీసీఏ ఆడిట్ నివేదిక తమకు అందిందని ఎయిరిండియా ధ్రువీకరించింది. నిర్ణీత గడువులోగా స్పందిస్తామని తెలిపింది. ‘‘అన్ని విమానయాన సంస్థలకు ఆడిట్‌లు జరుగుతాయి. అందులో భాగంగానే ఎయిరిండియా వార్షిక డీజేసీ ఆడిట్ జూలైలో జరిగింది. ఇందులో కనుగొన్న విషయాలను మేం అంగీకరిస్తున్నాం. నిరీ్ణత సమయ వ్యవధిలోపు మా ప్రతిస్పందనను, తీసుకున్న దిద్దుబాటు చర్యలను డీజీసీఏకు సమరి్పస్తాం. ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు మా సంస్థ పూర్తిగా కట్టుబడి ఉంది’’అని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది.
అహ్మదాబాద్ ప్రమాదం తరువాత..
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ కూలిపోయిన తర్వాత ఎయిర్‌లైన్‌పై తీవ్ర పరిశీలన జరిగిన నేపథ్యంలో ఆడిట్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఈ నెలలో 15 పేజీల ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజన్‌లకు ఇంధన సరఫరా సెకన్ల వ్యవధిలో ఆగిపోయిందని తెలిపింది. రెండు ఇంధన స్విచ్‌లు కొన్ని సెకన్ల వ్యవధిలో ‘రన్’నుంచి ‘కటాఫ్’కు మారాయని నివేదిక పేర్కొంది. ‘ఎందుకు ఆపేసావు?’అని ఒక పైలట్.. మరో పైలట్‌ను అడగ్గా, తాను అలా చేయలేదని మరో పైలట్ బదులివ్వడం కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో రికార్డయ్యింది.