పాఠశాలలో కళావేదిక స్లాబ్ వేస్తుండగా ప్రమాదం
కాంక్రీట్ తొట్టె మీదపడి ఉపాధ్యాయిని మృతి
పాయకరావుపేట: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరం గ్రామంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా కారణఃగా కాంక్రీట్ తొట్టె తలపై పడి ఉపాధ్యాయిని దుర్మరణం పాలైంది. రాజానగరం పాఠశాలలో సీఎస్సార్ నిధులతో డెక్కన్ కంపెనీ కళావేదిక నిర్మిస్తోంది. ఈ వేదికకు శుక్రవారం స్లాబ్ వేసే పనులు ప్రారంభమయ్యాయి. కాంక్రీట్‌ను ట్రాలీతో స్లాబ్‌పైకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ కర్రలు పడిపోయాయి. ట్రాలీ కోసం ఏర్పాటు చేసిన తాడు తెగిపోయింది.
ఇదే సమయంలో కళావేదిక పక్కన ఉన్న ఉపాధ్యాయ సిబ్బంది గదిలోకి సంతకం చేసేందుకు వెళ్తున్న ఇంగ్లిషు ఉపాధ్యాయిని ఎన్.జ్యోత్స్నబాయి (47) తలపై 50 కిలోల బరువున్న ట్రాలీ పడింది. తలకు తీవ్రగాయమై ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను తుని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతురాలు తుని వీరవరపు పేటలో నివసిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు. జ్యోత్స్న భర్త రెండేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. ఈ ప్రమాదానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణని టీచర్లు ఆరోపిస్తున్నారు. సహచర ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్, సూపర్‌వైజర్, మేస్త్రీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ అప్పన్న చెప్పారు.
కాకినాడ జీజీహెచ్‌లో ఘోరం
పడని ఇంజక్షన్ చేయడంతో గర్భిణి మృతి
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో తాజాగా మరో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి ఒక గర్భిణి బలైపోయింది. తాళ్లరేవు మండలం గాడిమొగ సమీపంలోని చినవలసలకు చెందిన మల్లేష్, మల్లీశ్వరి దంపతులు. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. మళ్లీ ఎనిమిదోనెల గర్భవతి అయిన మల్లీశ్వరి సాధారణ పరీక్షల కోసం ఈ నెల 14న కాకినాడ జీజీహెచ్‌లో చేరింది. ఆ సమయంలో తనకు పడని మందుల జాబితాను వైద్యులకు ఇచ్చిoది. ఈ వివరాలు కేస్ షీటులో రాసుకున్నారు.
గురువారం మధ్యాహ్నం ఆమె తనకు పడదని రాసిచ్చిన పాంటాప్రొజోల్ ఇంజక్షన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో బాధితురాలి వదిన, ఏఎన్‌ఎం అయిన ధనలక్ష్మి ఆ ఇంజక్షన్ మల్లీశ్వరికి పడదని, చేయవద్దని అడ్డుపడ్డారు. అయినా వినకుండా డాక్టరు ఆ ఇంజక్షన్ చేశారు. కొద్దిసేపటికే కుప్పకూలిన మల్లీశ్వరిని జీఐసీయూకు తరలించారు. అప్పటికే ఆమె అపస్మారకస్థితికి చేరుకుంది. వైద్యులు ఆమెకు అరగంటకు ఒకసారి సీపీఆర్ చేశారు. దీంతో ధనలక్ష్మి.. మల్లీశ్వరికి ఏమైందో చెప్పాలని, తమవారిని పిలుస్తానని చెప్పారు.
ఎవ్వరినీ పిలవొద్దని, బీపీ కాస్త అసాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు. చివరకు రాత్రి 11గంటల సమయంలో మల్లీశ్వరి చనిపోయిందని చెప్పారు. మల్లీశ్వరి మధ్యాహ్నం చనిపోతే కావాలనే వైద్యులు దాచిపెట్టారని మల్లీశ్వరి భర్త మల్లేష్, వదిన ధనలక్ష్మి విలపించారు. వైద్యులు చేసిన ఇంజక్షన్ సీసాను తీసుకుంటుంటే సిబ్బంది అడ్డగించారని తెలిపారు.
గొడవేమీ చేయవద్దని, అలా చేస్తే కేసు నమోదవుతుందని, పోస్టుమార్టం చేసి గర్భిణి దేహాన్ని కోయాల్సి ఉంటుందని భయపెట్టారని చెప్పారు. నిస్సహాయస్థితిలో మల్లీశ్వరి మృతదేహాన్ని అర్ధరాత్రి వేళ కాకినాడ నుంచి ఇంటికి తీసుకెళ్లాల్సి వ చ్చిందని కన్నీరుమున్నీరయ్యారు.


