నిబద్ధత
నిబద్ధత వ్యక్తి జీవితాన్ని విజయపథంలో నడిపిస్తుందనడానికి మహాభాగవతంలోని ధ్రువ చరిత్ర మంచి ఉదాహరణ. ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు (Dhruvudu) ఒకరోజు తన తండ్రి ఒడిలో కూర్చొని వుండగా, సవతి తల్లి సురుచి అతన్ని వారించి, నీకా అర్హత లేదు. నువ్వు విష్ణుభగవానుని ప్రసన్నం చేసుకోగలిగితే, అప్పుడు మాత్రమే నీతండ్రి ఒడిలో కూర్చోవడానికి అర్హుడవౌతావు అని అనడంతో ధ్రువుడు అవమానంగా భావించి, యీ మాటలను సవాలుగా స్వీకరించాడు. అప్పుడు ధ్రువుని వయసు ఐదు సంవత్సరాలే. కాని సవతి తల్లి మాటలు ధ్రువునికి తీవ్ర మనస్తాపాన్ని కలుగజేసాయి. విష్ణుని ప్రసన్నం చేసుకోవాలనే బలమైన కోరిక ధ్రువుని మనసులో స్థిరపడింది. ధ్రువుడు రాజ్యాన్ని వదలి అడవికి పోయాడు. నారదుడు ధ్రువుని ఇంటికి రప్పించే ప్రయత్నం చేశాడు గాని ‘నేను విష్ణువుని దర్శించే వరకు యింటికి రాను’ అన్న ధ్రువుని సమాధానంతో నారదుడు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న మంత్రాన్ని ధ్రువునికి ఉపదేశించాడు.
ధ్రువుడు అనేక సంవత్సరాలు ఆహారం, నిద్ర, చలనం లేకుండా ఘోర తపస్సు చేశాడు. కనీసం శ్వాస కూడా తీసుకోకుండా తపస్సు చేశాడు. అతని తపశ్శక్తి ముందు విశ్వశక్తి బలహీనపడింది. దేవతలంతా విష్ణువుని దర్శించి,‘స్వామీ జగద్రక్షకా ఆ బాలుని తపోశక్తి ముందు విశ్వమే తలవంచవలసి వస్తుంది. కనుక అతనికి మీ దర్శనభాగ్యం కలిగించమని మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ధ్రువునికి తన దర్శన భాగ్యం కలిగించాడు. ధ్రువుడు అమితానంద భరితుడై విష్ణువుని కీర్తించాలనుకున్నాడు కాని నోట మాటరాలేదు. అపుడు విష్ణుమూర్తి తన శంఖంతో ధ్రువుని నుదురు స్పృశించగానే దైవశక్తి దవునిలో ప్రవేశించింది. అప్పుడు దవుడు విష్ణుమూర్తిని కీర్తించగా, విష్ణుమూర్తి ‘‘ధ్రువా! నీవు ఈ భూమండలాన్ని వేల సంవత్సరాలు పాలిస్తావు. అంతేగాకుండా నువ్వు అమరుడవై ధ్రువనక్షత్రంగా వెలుగుతావు, అందరికీ మార్గదర్శక మౌతావు’’ అని ఆశీర్వదించాడు.
ధ్రువుడు సత్యాన్వేషణ లో బాధని అవకాశంగా మార్చుకోవడం వల్ల, కోరిక భవిష్యత్ దర్శినిగా మారింది. కష్టాలకోర్చి అడవిలో చేసిన తపస్సు, విజయానికి అంతః క్రమశిక్షణ అవసరమని నిరూపించింది. ధ్రువుడు లౌకిక విజయం (తండ్రి ఒడిలో కూర్చోవడం) కోసం ప్రయత్నిస్తే దైవానుగ్రహంతో అమరత్వాన్ని పొందాడు. గురువు (నారదుడు) చూపిన మార్గాన్ని విడిచిపెట్టకపోవడం విపత్తునెదుర్కొనే శక్తినిచ్చింది. విజయం నిబద్ధత తో కూడిన స్థిర చిత్తం నుంచి పుడుతుందని ధ్రువ చరిత్ర మానవాళికి సందేశం మిస్తుంది.
– డా. విశ్వేశ్వర వర్మ భూపతిరాజు


