సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు నిరవధిక బంద్‌ను పాటించనున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, బీఈడీ తదితర వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ కళాశాలలు బంద్‌కు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. దీంతో, కాలేజీలు మూతపడనున్నాయి.
రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే, దీపావళి నాటికి ప్రభుత్వం 600 కోట్లు ఇస్తామని భరోసా ఇచ్చినప్పటికీ ప్రభుత్వ హామీ నిలబెట్టుకోలేకపోవడంతో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు ఆందోళన బాట పట్టాయి. కాలేజీలు నడపలేకపోతున్నామని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో తక్షణమే బకాయిల్లో 50 శాతం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే, బంద్ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం 1200 కోట్లకు టోకెన్లు ఇచ్చి కేవలం 300 కోట్లు అందించినట్టు సమాచారం.



