సాక్షి, హైదరాబాద్: వరుస చెక్ డ్యామ్ కూలిన ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రకృతి వైపరీత్యమా, మానవ తప్పిద్దమా? అనే అంశం పై రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపట్టనున్నారు. పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యామ్‌లో కూలిన ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూలిపోయిన చెక్ డ్యామ్‌లపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. నాసి రక నిర్మాణం లేదా నాణ్యతలేమి తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కావాలనే ధ్వంసం చేసినట్లు నిర్ధారణ అయితే కఠిన శిక్షలు తప్పవన్నారు. ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.
విచారణను వేగవంతం చేయాలని విజిలెన్స్ శాఖను ఆదేశించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు మేలు చేసే చెక్ డ్యామ్‌లను ధ్వంసం చేస్తే ఊరుకోమన్న మంత్రి.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలను సహించబోమన్నారు.


