వీడిన విజయశాంతిరెడ్డి ఫ్యామిలీ సూసైడ్‌ కేసు మిస్టరీ! | Mystery of the Vijayashanti Reddy Family Suicide Case Solved Reason Is | Sakshi
Sakshi News home page

వీడిన విజయశాంతిరెడ్డి ఫ్యామిలీ సూసైడ్‌ కేసు మిస్టరీ!

Feb 7 2026 10:59 AM | Updated on Feb 7 2026 11:56 AM

Mystery of the Vijayashanti Reddy Family Suicide Case Solved Reason Is

సాక్షి, హైదరాబాద్‌: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌పై రైలుకు ఎదురెళ్లి బిడ్డలతో సహా బలవర్మణానికి పాల్పడిన విజయశాంతి రెడ్డి కేసు దాదాపు వీడింది. ఆమె ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడిందో అనే తేల్చే క్రమంలో పోలీసులు దాదాపు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపారు. చివరకు తీవ్ర డిప్రెషన్‌ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తేల్చారు. 

గత కొంతకాలంగా విజయశాంతిరెడ్డి డిప్రెషన్‌తో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు, ఇటు ఆఫీస్‌లోని తోటి సిబ్బంది సైతం ధృవీకరించారు. ఈ క్రమంలోనే ఆమె సూసైడ్‌ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే పిల్లలు ముందు నుంచి కూడా ఆమె కంట్రోల్‌లోనే ఉన్నారు. దీంతో తల్లి చెప్పినట్లే చేశారు. ఆమెతో పాటే వాళ్లు కూడా బలవన్మరణానికి పాల్పడి ఉంటారని ఒక అంచనాకు వచ్చారు. 

అయితే డిప్రెషన్‌కు గల కారణం ఏంటన్నది తేలాల్సి ఉంది. బహుశా.. పిల్లలను హాస్టల్‌లో ఉంచాల్సి రావడం, భర్తకు దూరంగా ఉంటుండడం ఆమెకు మానసికంగా కుంగదీసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వాడిన ఫోన్‌ తాలుకా.. ఫోన్‌కాల్‌ డాటాను మరింత లోతుగా విశ్లేషిస్తున్నట్లు సమాచారం.

జనవరి 31వ తేదీన ఉదయం చర్లపల్లి రైల్వే ట్రాక్‌ వద్ద గూడ్స్‌ రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్ని విజయ (35), విశాల్ (17), చైతన్య (18)గా గుర్తించారు. పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. భర్త దుబాయ్‌ నుంచి వచ్చాక స్వస్థలం బీబీనగర్‌లో అంత్యక్రియలు జరిపారు. ఘటనా స్థలంలోని విజయ కారు నుంచి సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. రైల్వేట్రాక్‌పై బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి తీసుకున్న నిర్ణయంపై.. తెలుగు రాష్ట్రాల సామాజిక మాధ్యమాల్లో అమ్మరాసిన మరణశాసనం అంటూ చర్చ జరిగింది. 

బంధువులే ఏమన్నారంటే..
ఉద్యోగరీత్యా.. పిల్లల భవిష్యత్తు కోసం భార్యభర్తల మధ్య దూరం ఆమెలో ఒంటరిననే భావనను పెంచిందని బంధువులు రైల్వే పోలీసుల విచారణలో చెప్పారు. సూసైడ్‌కు ముందు.. 15 రోజులుగా ఒంటరిదాన్ని అనే ఆలోచన ఆమెను మరింత కుంగదీసినట్లు తెలుస్తోంది. దగ్గరి బంధువులు, స్నేహితులతో ఇదే విషయాన్ని పదేపదే పంచుకుంటూ బాధపడేదంటూ విజయరెడ్డి సమీప బంధువు ఒకరు వివరించారు. ఒంటరిగా ఇంకెంతకాలం అంటూ బాధపడేదన్నారు. సంసారంలో ఇవన్నీ సహజమని భావించామని.. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయమని ఆమె స్నేహితులు చెబుతున్నారు. 

2007లో సురేందర్‌రెడ్డి, విజయరెడ్డిలకు వివాహమైంది. సురేందర్‌రెడ్డికి నాలుగేళ్ల క్రితం దుబాయ్‌లో కొలువురావటంతో అక్కడకు వెళ్లారు.  ఉప్పల్‌ డిపో రాఘవేంద్రనగర్‌లోతల్లి పుష్పలతతో కలిసి విజయరెడ్డి పిల్లలతో ఉంటున్నారు. ఆమె ఓ ఐటీ కంపెనీలో టీమ్‌లీడర్‌గా పనిచేస్తున్నారు. రాత్రి విధులు కావటంతో పిల్లలిద్దర్నీ హాస్టల్స్‌లో ఉంచి చదివిస్తున్నారు. 

ఆనాడు.. 
విజయరెడ్డి ఇంటి నుంచి సొంత కారులో బయటకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం హాస్టల్స్‌లో ఉన్న బిడ్డల్ని బయటకు తీసుకొచ్చారు. కారును చర్లపల్లి రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌లో నిలిపారు. మధ్యలో ఏడు గంటలపాటు వాళ్లు ఎక్కడికి వెళ్లారనేదానిపై స్పష్టత కొరవడింది. ఆపై పార్కింగ్‌ స్లిప్‌ వెనుక వైపు తనకు జీవించాలని లేదని.. తాను దూరమైతే పిల్లలు ఒంటరవుతారంటూ సూసైడ్‌నోట్‌ రాసి కారులోనే వదిలేశారు. అదే సూసైడ్‌లెటర్‌ను ఆమె ఫొటో తీసి తన వాట్సప్‌లో స్టేటస్‌గా ఉంచారు. ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు వెతికినా.. 
తమ మధ్య ఎలాంటి గొడవల్లేవని. కుటుంబానికి ఆర్థిక సమస్యలు కూడా లేవని విజయశాంతిరెడ్డి భర్త సురేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విజయ తల్లి కూడా పోలీసులకు తెలిపింది. దీంతో.. కేసు మరింత క్లిష్టంగా మారింది. చివరకు.. ఆమె ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌లను పోలీసులు విశ్లేషించినా లాభం లేకపోయింది. అందులోనూ ప్రొఫెషనల్‌ చాటింగ్‌లే తప్పా.. ఏం దొరకలేదు. ఆమె రెండో ఫోన్‌ వాడిందనే ప్రచారం తెర మీదకు రాగా.. పోలీసులు దానిని కొట్టిపారేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement