సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కీలకమైన తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ బిల్డింగ్ మొదటి ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే సీజ్డ్ ప్రాపర్టీ గదిలోని కీలక కేసులకు సంబంధించిన పేపర్ ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు ధృవీకరించారు.
శనివారం ఉదయం 10గం. ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను గమనించిన వాచ్‌మన్ అధికారులకు సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భవనం అంతటా దట్టమైన పొగలు అలముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే.. తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగలిగారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇక ఈ ల్యాబ్‌లోనే డీఎన్‌ఏ పరీక్షలు, ఫింగర్‌ప్రింట్ విశ్లేషణకు సంబంధించిన వివరాలు ఉంటాయి. కీలక కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలను ఇక్కడే భద్రపరుస్తారు. వాటికి సంబంధించిన పేపర్ వర్క్ పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.
ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలో ప్రమాదం జరిగింది. ఉదయం 10:30 గంటలకు సమాచారం అందడంతో హుటాహుటిన వచ్చాం. ఫైర్ సిబ్బంది శ్రమతో మంటలు అదుపులోకి వచ్చాయి. మొదటి అంతస్తులోని వివిధ కేసుల్లో ఉన్న సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. చాలా విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. పలు కేసుల్లో సీజ్ చేసిన 40-50 కంప్యూటర్లు కాలిపోయాయి. మొదటి అంతస్తులో సెన్సిటివ్‌గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు బూడిదయ్యాయి. కెమికల్ లాబ్ మెటీరియల్ అంత రెండవ అంతస్తులో ఉంది. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగింది’’ అని తెలిపారు.
తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ అత్యంత కీలకమైంది. ఓటుకు నోటు కేసులో వీడియో, ఆడియో ఫైల్స్‌తో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. అలాగే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డాటా, హార్డ్ డిస్కులు ఇక్కడే ఉన్నట్లు సమాచారం అందుతోంది. కేవలం సీజ్డ్ గదిలోనే ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


