సాక్షి, తాడేపల్లి: మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవటంలో చంద్రబాబు నిష్ణాతుడు అని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఆలయాల్లో దుర్ఘటనలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కాశీబుగ్గ ప్రమాదం, తుపాను వైఫల్యాలను కప్పి పుచ్చటానికే మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు అని తెలిపారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ అని చెప్పుకొచ్చారు.
మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కాశీ బుగ్గ ప్రమాద మృతులకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలి. ఆలయం ప్రైవేటు వారిదంటూ తప్పించుకోవాలనుకుంటే కుదరదు. వేల మంది భక్తులు ఆలయానికి వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది?. వీటికి సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తామంటే జనం సహించరు. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవటంలో చంద్రబాబు నిష్ణాతుడు. ఆలయాల్లో దుర్ఘటనలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. డైవర్షన్ రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదు.
కాశీబుగ్గ ప్రమాదం, తుపాను వైఫల్యాలను కప్పి పుచ్చటానికే జోగి రమేష్ అరెస్టు. నకిలీ మద్యం గురించి మాట్లాడినందుకు జోగిని అరెస్టు చేశారు. ప్రతి మూడు సీసాల్లో ఒకటి నకిలీ మద్యమే. డైవర్షన్ బాబు.. చంద్రబాబు. ప్రజలను కాపాడటానికి అధికారంలోకి వచ్చారా? లేక డైవర్షన్ రాజకీయాలు చేయడానికా?. జయచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు, పీఏలను ఎందుకు వదిలేశారు?. జనార్ధనే నకిలీ మద్యం కేసు నిందితుడు. టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగింది. దాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. అమెరికాకు కూడా తెలియని టెక్నాలజీ నా దగ్గర ఉందనే చంద్రబాబు నకిలీ మద్యం తయారవుతున్న విషయం తెలియలేదా?.
టెక్నాలజీ ఏది బాబూ?
కాశీబుగ్గలో జనం తొక్కిసలాట గురించి నీ టెక్నాలజీ ముందే చెప్పలేదా చంద్రబాబు?. తిరుపతి తొక్కిసలాటలో భక్తులు చనిపోతే మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?. సింహాచలం, కాశీబుగ్గ ఘటనలు ప్రభుత్వ వైఫల్యాలే. చంద్రబాబు లండన్ ఎందుకు వెళ్లారో ప్రజలకు ఎందుకు చెప్పలేదు?. మొదట అధికారిక పర్యటన అన్నారు, ఇప్పుడు వ్యక్తిగత పర్యటన అని అంటున్నారు. చంద్రబాబు వ్యక్తిగత పనులు ఏం ఉన్నాయో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. తుపాను కంట్రోల్ చేశానని చెప్పుకున్న చంద్రబాబు మరి ఎనిమిది మంది ఎలా చనిపోయారో చెప్పాలి.
అందుకే ఎల్లో మీడియా జాకీలు..
వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లయితే నష్టం తగ్గేది. పంట నష్టం అంచనాలు సాయంత్రానికే తెలిసేవి. ఎకరానికి లక్ష రూపాయల చొప్పున నష్టం జరిగింది. దానిపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?. రైతులను ఆదుకోకుండా తుపాను వారియర్స్‌కు సత్కారం అంటూ మరొక ఈవెంట్ చేశారు. వైఎస్ జగన్ పాలనలో ఒక్క హిందూ ఆలయంలో ఇలాంటి దుర్ఘటన జరిగిందా?. చంద్రబాబు పాలనా దక్షుడు కాదని ఎల్లో మీడియాకు కూడా తెలుసు. కానీ, ఆయన సీఎంగా ఉంటేనే వాటాలు పంచుకోవచ్చని ఎల్లో మీడియా జాకీలు వేస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.


