
సాక్షి, విజయవాడ: ప్రజల ఆందోళనను, రాజకీయ పార్టీల అభ్యంతరాలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లెక్క చేయలేదు. అన్నంత పని చేసేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు టెండర్ నోటిఫికేషన్ ఇవాళ జారీ అయ్యింది.
తొలివిడత నాలుగు మెడికల్ కాలేజీలను పీపీపీ(Public-Private Partnership)లో అప్పగించేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మెడికల్ కాలేజీలు.. 625 పథకాల సూపర్ స్పెషలిటీ ఆస్పత్రుల పీపీపీకి టెండర్ ప్రకటన ఏపీ ఎంఎస్ఐడీసీ రిలీజ్ చేసింది.

చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణ, ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, అలాగే వైద్య విద్యపై తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌సీపీ, ఎమ్మార్పీఎస్, ఇతర సామాజిక సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటు ప్రజలలోనూ ఈ నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంగా ఇన్నేళ్ల తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టని చంద్రబాబు.. పేదలు, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందాలనే లక్ష్యంతో తాము నిర్మించిన కాలేజీలను ప్రైవేట్ చేతుల్లో పెడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేపు తాము అధికారంలోకి వచ్చాక టెండర్లు రద్దు చేసి తీరతామని హెచ్చరించారు కూడా.
