జనార్దనరావు కట్టుకథనే వల్లెవేసిన సిట్
సాక్షి, అమరావతి: జోగి రమేష్‌కు వ్యతిరేకంగా సిట్ అధికారులు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా రిమాండ్ నివేదికలో చూపించలేక పోయారు. వారు బెదిరించి జనార్దనరావుతో నమోదు చేయించిన అబద్దపు వాంగ్మూలం ఆధారంగానే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. జోగి రమేష్, జనార్దనరావు మధ్య.. జోగి రమేష్, జయచంద్రారెడ్డిలమధ్య వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక్క ఆధారం కూడా చూపలేదు. అదే సమయంలో జయచంద్రారెడ్డి, జనార్దనరావు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.
జయచంద్రారెడ్డికి టీడీపీ అధిష్టానానికి మధ్య రాజకీయ బంధం, అనుబంధం ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు. మరి నకిలీ మద్యం మాఫియాలో పాత్రధారి అయిన జయచంద్రారెడ్డి వెనక సూత్రదారులుగా ఉన్న టీడీపీ పెద్దలపై విచారణ ఎందుకు చేపట్టలేదో సిట్ అధికారులకే తెలియాలి. ఈ రిమాండ్ నివేదికలో జోగి రమేష్ వాంగ్మూలం ఇచ్చినట్టు, ఆయన సంతకం చేసినట్టు సిట్ ప్రస్తావించక పోవడం గమనార్హం. అంటే సిట్ అధికారుల నిరాధార ప్రశ్నలతో కూడిన కుట్రను విచారణ సందర్భంగా ఆయన తిప్పికొట్టినట్టు స్పష్టమవుతుంది. అంతా కట్టుకథ అని తెలుస్తోంది.
కాగా, జోగి రమేష్æ ఏ–18, జోగి రాము ఏ–19గా చూపించారు. ఈ కేసులో మరో నలుగురిని ఏ–20గా మనోజ్ కొఠారి, ఏ–21గా సుదర్శన్, ఏ–22గా సింథిల్, ఏ–23గా ప్రసాద్‌ను తాజాగా చేర్చారు. ఇప్పటి వరకు మొత్తం 23 మందిపై కేసు నమోదైంది. టీడీపీ పెద్దలే కర్త, కర్మ, క్రియగా సాగిన నకిలీ మద్యం మాఫియా కేసును పక్కదారి పట్టిస్తూ సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టును రూపొందించడం విస్మయ పరుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో జోగి రమేష్‌ను హాజరు పరిచిన నేపథ్యంలో సమర్పించిన రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను స్పష్టం చేసింది. కేసులో వాదనలు అర్ధరాత్రి 1.30 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.
⇒ జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది టీడీపీయే. ఆయనకు మద్యం దుకాణాలు మంజూరైంది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం తయారుచేసి విక్రయించిందీ ఆ మద్యం దుకాణాల ద్వారానే. అంటే ఆయన రాజకీయ జీవితం, వ్యాపార వ్యవహారాలన్నీ టీడీపీతోనే ముడిపడ్డాయి. ఈ విషయాలన్నింటినీ సిట్ రిమాండ్ నివేదిలో పేర్కొంది. కానీ టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన సన్నిహితుడు అద్దేపల్లి జనార్దనరావు ఈ నకిలీ మద్యం దందా అంతా వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ చెబితే చేశారట! వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా న్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వం ఇలా బరితెగించి సిట్‌తో కుతంత్రాలు చేయించింది.
⇒ ఈ కేసులో ఏ1గా అద్దేపల్లి జనార్దనరావును కేంద్రబిందువుగా చేసుకుని సిట్.. జోగి రమేష్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని స్పష్టమవుతోంది. టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి, జనార్దనరావు వ్యాపార భాగస్వాములు, సన్నిహితులని సిట్ చెబుతోంది. కానీ జనార్దనరావు.. జోగి రమేష్‌కు సన్నిహితుడని నమ్మించేందుకు సిట్ కట్టుకథలు అల్లింది.
⇒ జోగి రమేష్ చెబితేనే జనార్దనరావు నకిలీ మద్యం తయారీకి సిద్ధపడ్డారని సిట్ చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ చెబితే ఆయన ఎందుకు చేస్తారనే కనీస అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. వారిద్దరూ (జనార్దనరావు, జయచంద్రారెడ్డి) ఎన్నో ఏళ్లుగా ఆఫ్రికాలో ఇదే తరహా నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించారని అదే నివేదికలో సిట్ పేర్కొంది. అటువంటి చరిత్ర ఉన్న జయచంద్రారెడ్డికి టీడీపీ ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్న విషయాన్ని సిట్ అధికారులు ఉద్దేశ పూర్వకంగానే పట్టించుకోలేదు. ఎందుకంటే రాష్ట్రంలో నకిలీ మద్యం దందాకు పాల్పడాలనే కుట్రతోనే ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చింది. అందుకే ఆ అంశాన్ని సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపర్చలేదు.

నేను ఏ తప్పూ చేయలేదు
న్యాయమూర్తి ఎదుట జోగి రమేష్
తాను ఏ తప్పు చేయలేదని, నకిలీ మద్యం వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని జోగి రమేష్ న్యాయమూర్తి ఎదుట స్పష్టం చేశారు. పాత విషయాలను దృష్టిలో పెట్టుకుని తనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబు తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆవేదన వ్యక్తంచేశారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు చనిపోవడం, తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనను అరెస్టు చేశారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారని, పైన దేవుడు కూడా చూస్తున్నాడన్నారు.


