మధ్యప్రదేశ్‌కెళ్లిన రెండు బృందాలు
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అనంతపురం: నగరంలో జిమ్ నిర్వాహకుడు రాజశేఖర్‌రెడ్డి వద్ద ‘గన్’ లభించడం కలకలంరేపింది. నగరంలోని విద్యుత్ నగర్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డి భార్య మనుషాను గన్‌తో బెదిరించిన విషయం తెలిసిందే. దంపతుల మధ్య కొన్నిరోజులుగా మనస్పర్థలున్నట్లు ఈనెల 11న నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రాజశేఖర్‌రెడ్డి నుంచి పోలీసులు గన్ స్వా«దీనం చేసుకున్నారు. విచారణలో అతడు మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో గన్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో ఇద్దరు సీఐలతో రెండు దర్యాప్తు బృందాలు గ్వాలియర్‌కు వెళ్లి ఆయుధాల తయారీదారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పారిపోయినట్లు సమాచారం.
పట్టుబడిన ఇద్దరిని ఓ పోలీసు బృందం అనంతపురం తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, రాజశేఖర్ రెడ్డికి అనంతపురం నగరంలో సహకారం అందించిన వారిపైనా పోలీసులు దృష్టి పెట్టారు. అనంతపురం నగరానికి చెందిన ఇద్దరిని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి అక్రమ ఆయుధాలు అనంతపురంలో ఎంత మంది వద్ద ఉన్నాయనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. నగరానికి చెందిన వ్యక్తులకు అక్రమ ఆయుధాలు సరఫరా చేసే ముఠాకు సంబంధాలు ఉండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇలాంటి అక్రమ ఆయుధాలు ఇంకా ఎంత మంది వద్ద ఉన్నాయనే భయం వెంటాడుతోంది. జిమ్ నిర్వాహకుడు అయిన రాజశేఖర్ రెడ్డికి ఇంకా ఎంత మందితో పరిచయాలు ఉన్నాయనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


