నల్గొండ జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం సీత్యాతండాలో బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీత్యాతండా గ్రామానికి చెందిన రమావత్ రవి(34)కి మిర్యాలగూడ మండలం ఏడుకోట్ల తండాకు చెందిన లక్ష్మితో 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రవి తల్లిదండ్రులు కూడా అతడితో పాటే ఇంటి ముందు గుడిసెలో నివాసముంటున్నారు.
రవి సొంత సోదరి కుమారుడైన మిర్యాలగూడ మండలం దొండవారిగూడెం గ్రామానికి చెందిన మాలోతు గణేశ్‌కు లక్ష్మి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా.. ఇదే విషయమై రవి పలుమార్లు లక్ష్మిని మందలించాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాగా లక్ష్మి సంవత్సరం క్రితం తన తల్లిగారింటికి వెళ్లింది. రవి తల్లిదండ్రులు పెద్దమనుషులతో మాట్లాడించి లక్ష్మిని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అయితే లక్ష్మి ఎలాగైనా తన భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. మంగళవారం ఉదయం రవి చిన్న కుమారుడిని హాస్టల్‌లో విడిచిపెట్టేందుకు అతడి తండ్రి సూర్యాపేటకు వెళ్లాడు.
మధ్యాహ్నం రవి మద్యం సేవించి ఇంట్లో నిద్రిస్తుండగా.. లక్ష్మి తన ప్రియుడు గణేశ్‌ను ఇంటికి పిలిచింది. అనంతరం రవి నోట్లో టవల్ పెట్టి కర్రతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం లక్ష్మి, గణేశ్ అక్కడి నుంచి పారిపోయారు. బుధవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా రవి విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించారు. మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్, ఎస్‌ఐ కృష్ణయ్య ఘటనా స్థలంలో క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు.


