తిరుపతి క్రైమ్ : స్థానిక తిమ్మినాయుడుపాళెంలో నివసిస్తున్న ప్రియాంక (30) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వివరాల ప్రకారం.. ప్రియాంక ఇరిగేషన్ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులు గతంలో మృతి చెందడంతో కొంతకాలంగా ఆమె ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. అయితే ఆ ప్రేమ వ్యవహారం విఫలమైన నేపథ్యంలోనే ఈ ఘోర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
శనివారం రాత్రి ఆమె తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


