ఉన్న మాటంటే ఉలుకెక్కువ.. చంద్రబాబుకి ఈ విషయంలో మరీనూ. ఆయన ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. 2019-2024 ఈ ఐదేళ్లు ఏపీ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. కరోనా లాంటి కష్ట కాలంలోనూ రాష్ట్రానికి జగన్ ఎంతో సమర్థవంతంగా పాలించడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. మరి విజనరీగా చెప్పుకునే చంద్రబాబు అన్నీ బాగున్నా.. నాలుగుసార్లు సీఎంగా ఉండి చేసింది ఏంటి?. ఆ వివరాలే కాస్త లోతుల్లోకి వెళ్లి చెప్పుకుందాం..
‘‘చెప్పిందే చేస్తాం.. చేయగలిగిందే చెప్తాం..’’ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్‌గా, ఓ ఖురాన్‌గా భావించే వైఎస్ జగన్ చెప్పే ముందు మాట ఇది. ఆ మాటను మడమ తిప్పకుండా ఐదేళ్లపాటు ఆచరణలో చేసి చూపించారాయన. ఇచ్చిన హామీలలే కాదు చెప్పని మంచిని చేసి చూపించి ఎన్నికల హామీలకంటూ ఒక నిర్వచనం.. ఓ పరిపూర్ణతను తీసుకొచ్చారు. మరి చంద్రబాబు చేసిందేంటి.. ఇప్పుడు చేస్తోంది ఏంటి?..
మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన ఘనత చంద్రబాబుది. పైగా ప్రజలకిచ్చిన హామీల్ని ఎగ్గొట్టిన ట్రాక్ రికార్డ్ కూడా బాబుగారి సొంతం!. వీటికి తోడు ‘‘అమలు చేసేశాం’’ అంటూ హడావిడితో జనాల్ని మభ్య పెడుతూ.. కాకి లెక్కలతో కాలం గడిపేస్తుంటారు. గత ఎన్నికల్లోనూ అప్పులతో ఏపీ శ్రీలంక అయిపోతోందని జగన్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి.. తీరా ఈ ఏడాదిన్నరలో 2 లక్షల 66 వేల కోట్ల అప్పులు చేసి సౌత్ సూడాన్‌లా మార్చేస్తున్నారు. అందుకే చంద్రబాబులా.. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, జనాల్ని చీటింగ్ చేయడం తనవల్ల కాదంటూ జగన్ ఏనాడో తేల్చేశారు!.
అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధి.. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ చూసిన నిత్య చిత్రం ఇది. గ్రామస్థాయి పాలన మొదలుకుని రైతులతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు.. సకాలంలో ఆ పథకాల అమలు.. తద్వారా ప్రత్యక్ష లబ్ధిదారులకు నిధుల పంపిణీ.. విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు ఇలా అన్ని రంగాలపై దృష్టి పెట్టి విప్లవాత్మక నిర్ణయాలతో పరిపాలించారు. మరీ ముఖ్యంగా పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. మరి బాబుగారో..
ఒకప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ఎటూ తిరిగి ప్రజలకు తాను ఇచ్చిన వాగ్దానాల్లో చంద్రబాబు ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఆయన పని చేసేది పెత్తందారుల కోసమే. తనకో విజన్ ఉందని చెబుతూ పెట్టుబడుల కోసం పాకులాడడం, పరిశ్రమలు.. కంపెనీలు రాబోతున్నాయంటూ హడావిడి చేయడం.. అమరావతి పేరిట అంతర్జాతీయ రాజధానంటూ ఊహాలోకంతో జనాలను మాయ చేయడం.. ఇదే ఆయనకు తెలిసింది. సీఎంగా ఇన్నేళ్లలో అభివృద్ధి ప్రాజెక్టుల పేరు చెప్పుకుని ఆయన సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా.. రైతుల నుంచి మొదలు అన్నివర్గాలు ఆయన చేతుల్లో మోసపోయి అవస్థలు పడ్డాయి.
జగన్ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు అదుపులో ఉండేవి. దిశ లాంటి చట్టం, యాప్‌తో మహిళలు భద్రంగా ఉండేవాళ్లు. ఆ ఐదేళ్లలో నేరాలు-ఘోరాలు పెద్దగా రికార్డు కాలేదు. సమత్యుల అభివృద్ధి కోసం మూడు రాజధానుల కోసం తీవ్రంగా ప్రయత్నించింది జగన్ ప్రభుత్వం. అయినా కూడా ఐదేళ్లపాటు జగన్ జన సంక్షేమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం చిమ్మని రోజంటూ లేదు. ప్రజల్లో లేని భయాలు.. అపోహలు సృష్టించుకుంటూ వచ్చింది చంద్రబాబుకి బాకా ఊదే మీడియా.. టీడీపీ అనుకూల సోషల్ మీడియా. మరి ఇప్పుడు కూటమి పాలనలో ఏం జరుగుతోంది?..
👉నవరత్నాలతో పేద, రైతు, మహిళ, వృద్ధులు, విద్యార్థులు.. ఇలా ప్రతీ వర్గానికి మేలు చేసింది ఎవరు?. అన్ని వర్గాలను మోసం చేసింది.. చేస్తోంది ఎవరు?.. సంక్షేమం పేరిట లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు జమ చేసింది ఎవరు?. తల్లికి వందనం.. నిరుద్యోగ భృతి.. సంక్షేమాన్ని ఎగ్గొడుతోంది ఎవరు?. ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చి మహిళా సాధికారతకు పెద్ద పునాది వేసింది ఎవరు?. డ్వాక్రా మహిళలను మోసం చేసింది ఎవరు?..
👉రైతు భరోసా రూపంలో అన్నదాతకు ఆర్థిక సాయం.. ఆర్బీకేలతో అన్నివిధాలుగా ఆదుకుంది ఆదుకుంది ఎవరు?. అన్నదాత సుఖీభవతో మోసం చేస్తోంది ఎవరు?.. గిట్టుబాట ధర అందించడంతో పాటు బీమాలు, సకాలంలో పంట నష్టాలు అందించింది ఎవరు?. వ్యవసాయం దండగ అన్నది ఎవరు?.. గిట్టుబాటుధర లేక అల్లాడుతున్న రైతుల్ని గాలికొదిలేసింది ఎవరు?.
👉నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ బడులు బాగుచేసింది ఎవరు?.. వాటిల్లో ట్యాబులిచ్చి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను పేద పిల్లలకు అందించే ప్రయత్నం చేసింది ఎవరు?. అవే బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తొలగించింది ఎవరు?.. పిల్లలకు నాసిరకం బ్యాగుల్ని అందిస్తోంది ఎవరు?.
👉గ్రామ సచివాలయాల పేరిట ప్రజలకు ఒకే దగ్గర వివిధ సేవల్ని అందించింది ఎవరు?.. వలంటీర్ లాంటి వారధి వ్యవస్థను మోసం చేసి నిర్వీర్యం చేసిందెవరు?. క్యూల అవసరమే లేకుండా ఒకటో తేదీనే ఫించన్లు.. రేషన్‌ను డోర్‌డెలివరీ చేసింది ఎవరు?.. ఫించన్ హామీని నెరవేర్చకుండా.. లబ్ధిదారుల్లో కోతలు విధిస్తోంది ఎవరు?. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు విస్తరించింది ఎవరు?. విలేజ్ క్లినిక్స్.. ఫ్యామిలీ డాక్టర్‌తో ప్రజల వద్దకే వైద్యం చేర్చింది ఎవరు?.. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోంది ఎవరు?.
👉పేద, మధ్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి వైద్యం.. పిల్లలకు వైద్య విద్య కోసం మెడికల్ కాలేజీల కట్టించింది ఎవరు?.. ఇప్పుడు వాటిని ప్రైవేట్‌పరం చేస్తోంది ఎవరు?.. కరోనా కాలంలోనూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంది ఎవరు?.. కరోనా కాలంలో పొరుగు రాష్ట్రం పారిపోయింది ఎవరు?.. సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది ఎవరు?.. ఆ ప్రజల జీవితాల్ని పట్టించుకోనిది ఎవరు?.
👉అసలు అభివృద్ధి చేసిందెవరు?.. ఆ అభివృద్ధిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ.. క్రెడిట్ కొట్టేస్తుందెవరు?.. ఏపీని అన్ని రంగాల్లో దూసుకుపోయేలా చేసి.. కేంద్రం నుంచి అవార్డులు, పేరు ప్రఖ్యాతులు తెచ్చింది ఎవరు?.. ఇప్పుడు ఏపీని పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు మారుస్తోంది ఎవరు?. ఎవరిది సంక్షేమం.. ఎవరిది మోసం.. అబద్ధాలతో ఎల్లకాలం పాలించగలరా?.. ఏపీ ప్రజలు ఆ మాత్రం ఆలోచించలేరా?..
కాకిలా కలకాలం కాదు.. హంసలా బతకాలంటారు పెద్దలు(చంద్రబాబు లాంటి వాళ్ల కాదు). నిబద్ధత కలిగిన నాయకుడంటే ఎలా ఉండాలో.. ఒక రాష్ట్రాన్ని ఎలా పాలించాలో.. జగన్ చూసైనా నేర్చుకోవయ్యా చంద్రబాబూ. నీ జీవితంలో కనీసం అలా ఒక్కరోజైనా పాలించగలవా?..


