ఆయన పేరు వింటే సంక్షేమం గుర్తుకొస్తుంది.. ఆయన పేరు వింటే పల్లె గడప పులకరిస్తుంది.. పట్టణ ముంగిట అభివృద్ధి పలకరిస్తుంది.. ఆ పేరు ఎందరికో స్ఫూర్తి.. మరెందరికో ఆ పేరే ఆస్తి.. ఆ పేరే వైఎస్ జగన్. గ్రామ, వార్డు సచివాలయాల సృష్టికర్త అతడే.. అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత అతడిదే.. సంక్షేమాన్ని గడపదాకా తీసుకొచ్చిన పేదింటి ముద్దుబిడ్డడతడు.. విద్యార్థులకు ముద్దుల మావయ్య అతడు.. అవ్వాతాతలకు అండగా నిలిచిన మనవడతడు.. అక్కచెల్లెమ్మలు మెచ్చిన నిండు సోదరుడతడే.. రైతన్నలకు ఆత్మబంధువూ అతడే..తెలుగునేల గర్వించదగ్గ నేతల్లో ఒకడు.. ఇలపై అత్యధిక ‘ఫ్యాన్’ ఫాలోయింగ్ కలిగిన లీడర్లలో ఒకడు. ఆయనే వైఎస్ జగన్మోహనుడు.
బద్వేలు : వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిన నేతగా పేరు గడించారు. రాజకీయాల్లోకొచ్చిన దశాబ్ద కాలంలోనే వందేళ్ల అనుభవం సంపాదించిన నేతగా దేశ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసుకున్నారు. హస్తిన కోటను ఎదిరించిన వైఎస్ జగన్ రాజకీయ అనుభవం సంపాదించేందుకు నేరుగా ప్రజల వద్దకే తన అడుగుల సవ్వడులను మళ్లించాడు. అదే ప్రజా సంకల్పయాత్ర. 2017లో ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ ఘాట్‌లో మొదలైన ఈ సంకల్ప యాత్ర 3,648 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా సాగింది. ఈ సంకల్ప యాత్రలోనే రావాలి జగన్.. కావాలి జగన్ అనే నినాదంపురుడు పోసుకుంది. అదే సంకల్ప యాత్రలో తొమ్మిది ప్రజా సంక్షేమ పథకాలైన నవరత్నాలు రూపుదిద్దుకున్నాయి.
పడిలేచిన కెరటం వైఎస్ జగన్
ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగన్ పడిలేచిన కెరటంలా నిలిచాడు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టేనాటికే రాజకీయ గాలి చేదుగా ఉంది. నమ్మక ద్రోహుల కాలం నలుమూలలా వ్యాపించి ఉంది. గోతులు తీసే చేతులే కరచాలనం చేస్తున్నాయి. మంచివాశ్లనుకున్న వాల్లంతా మంచిని తుంచి రొట్టె ముక్కలా నమిలి మింగేస్తున్నారు. తండ్రి మరణించిన తరువాత పట్టుమని పదిరోజులు కూడా ఇంటి పట్టున ఉండలేదు. ప్రజల కోసం ప్రయాణం మొదలెట్టాడు. ప్రజల గుండె చప్పుడు వింటూ ముందుకు సాగాడు. సాగుతున్నంత సేపు ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఎదురుదెబ్బలు తిన్నాడు.. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాడు.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు.
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ..
2014 నుంచి 2019 దాకా ఐదేళ్లు ప్రతిపక్షనేతగా ప్రజ ల పక్షాన పోరాడిన అనంతరం 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజ యం సాధించి అధికారం చేపట్టారు. ఆ క్షణం నుంచి సంక్షేమాన్ని.. అభివృద్ధిని జోడు గుర్రాల్లా పరుగులు పెట్టించారు. ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినట్లుగానే మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్,వ్యవసాయానికి ఉచిత విద్యుత్,108 వాహనాలు తదితర పథకాలను పునర్జీవం చేయడమే గాకుండా మరింత గొప్పగా అమలు చేసి చూపించారు. అంతేనా గ్రామ, వార్డు సచివాలయాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోనే కొత్త పాలనకు నాంది పలికారు. నవరత్నాలతో సంక్షేమాన్ని పేదింటి గడపకే చేరవేశారు. ఇక కోవిడ్ సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి,కమ్మ,ఆర్యవైశ్య,బ్రాహ్మణ,క్షత్రియ,వెలమలతో పాటు ఇతర ఓబీసీ సామాజిక వర్గాలకు ఈబీసీ నేస్తం కింద అర్హులందరికీ ఆర్థిక సహాయం అందించారు. జగనన్న వసతి దీవెన, అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో నిధులు జమచేశారు. ఇక కడప గడపలో అనేక పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధిబాట చూపించా రు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్షలాదిమందికి ఆర్థిక సాయం చేసి మనసున్న మారాజుగా నిలిచిపోయారు.
నేడు జన్మదిన వేడుకలు..
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.

మళ్లీ జగనన్న పాలనే రావాలి
ఈ చిత్రంలో కనిపిస్తున్న మల్లవత్తుల చిన్నచెన్నయ్య కుటుంబ సభ్యులు బద్వేలు పట్టణంలోని భావనారాయణనగర్‌లో నివసిస్తున్నారు. వీరికి గత 2019–2024 మధ్య కాలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.5,73,750లు లబ్ధి చేకూరింది. చిన్నచెన్నయ్యకు చేనేత పెన్షన్ కింద నెలకు రూ.4 వేలు చొప్పున రూ.2.40 లక్షలు, చెన్నయ్య భార్య చెన్నమ్మకు ఆసరా పథకం కింద ఏడాదికి రూ.18,750లు చొప్పున రూ.93,750లు, చెన్నయ్య కుమారుడు చెండ్రాయుడుకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు, చెన్నయ్య కోడలు వెంకటసుబ్బమ్మకు సున్నావడ్డీ కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.50 వేలు, చెన్నయ్య మనవడు చెన్నసాయికి అమ్మఒడి పథకం కింద రూ.70 వేలు అందింది. జగనన్న హయాంలో తమ కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరిందని, మళ్లీ ఆయన పాలనే రావాలని ఈ సందర్భంగా వారు కోరారు. –బద్వేలు అర్బన్

లీడర్ అంటే జగనే
ఇంట్లోవాళ్లకు కష్టమొస్తే మనసు పడే బాధేంటో ఆ క్షణం తెలిసింది.. ఆ కష్టకాలంలో ‘నేనున్నానని’ జననేత భరోసా ఇచ్చినప్పుడు ‘లీడర్ అంటే వైఎస్ జగన్‌లా ఉండాలని’ ఆ రోజే తెలిసింది.. ఆయన మనసెంత గొప్పదో ఆ పూటే తెలిసింది.. ఇదీ ప్రొద్దుటూరుకు చెందిన సయ్యద్ కరీముల్లా కుటుంబ సభ్యుల మనోగతం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న సయ్యద్ కరీముల్లాకు 2021లో లివర్ దెబ్బతింది. దీంతో ఆయన అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని ఆశ్రయించారు. సమస్య తీవ్రతను గుర్తించిన రాచమల్లు సీఎంఓకి ఫోన్ చేశారు. కరీముల్లా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఒక్క రోజులోనే రూ.25లక్షలు (ఎల్‌ఓసీ) మంజూరు చేయగా ఆపరేషన్ విజయవంతమైంది. ‘మా కష్టాన్ని వినడమే కాదు.. నేనున్నానంటూ ఆదుకున్న మనసున్న లీడర్ వైఎస్ జగన్..’ అని కరీముల్లా సతీమణితోపాటు పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు. అంతేనా ‘అల్లా ఉన్‌కో అచ్ఛా రఖే’ అంటూ చేతులెత్తి దువా చేశారు. – ప్రొద్దుటూరు
మా కుటుంబానికి దేవుళ్లు
వైఎస్సార్.. వైఎస్ జగన్ మా కుటుంబానికి దేవుళ్లు. 2004లో వైఎస్ సీఎం కాగానే మా నాన్నకి రూ.56వేలు రుణమాఫీ అయింది. దీంతో పాటు అప్పటి వరకూ ఉన్న వ్యవసాయ విద్యుత్ బకాయిలు రూ.6వేలు మాఫీ అయ్యా యి. ఆయన మరణాంతరం ఎలాంటి పథకం మా కుటుంబానికి అందలేదు. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక మా కుటుంబానికి అమ్మఒడితో మొదలుకొని అన్ని పథకాలు వరుసగా వచ్చాయి. పంటల బీమా నష్ట పరిహారం రూ.66వేలు వచ్చింది. దీని తర్వాత ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1.95లక్షలు వచ్చింది, రైతు భరోసా ప్రతి ఏటా పడింది.. నా భార్యకు రూ.50వేలు డ్వాక్రా రుణమాఫీ అయింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మా కుటుంబానికి రూ.5లక్షలు పైగా డబ్బులు అందాయి. వైఎస్సార్.. వైఎస్ జగన్ మా పాలిట దైవం. మళ్లీ జగనన్న సీఎం అయితే మా లాంటి ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది.
– పెసల కొండారెడ్డి, చియ్యపాడు, చాపాడు మండలం
ఎప్పటికీ రుణపడి ఉంటా..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నా పాలిట దేవుడు. 2023లో విజయవాడ నుంచి పోరుమామిళ్లకు వస్తుండగా నా కారుకు యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్లకు కోటి రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన ఆయన ఆస్పత్రిలో ఖర్చయ్యే మొత్తం రూ.70లక్షలు సీఎం సహాయ నిధి నుంచి ఇచ్చి నా ప్రాణాలను కాపాడాడు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా. – డి.సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ,
కాశినాయన మండలం, వైఎస్సార్ కడప


