పచ్చ మాఫియా దందా.. అందుకే ‘సిట్‌’ అండ! | YSRCP Alleges TDP Leaders Shielded In Fake Liquor Mafia Case, SIT Investigation Diverted Under Government Orders | Sakshi
Sakshi News home page

పచ్చ మాఫియా దందా.. అందుకే ‘సిట్‌’ అండ!

Nov 3 2025 5:36 AM | Updated on Nov 3 2025 11:55 AM

TDP conspiracy on Liquor Case: Andhra pradesh

2024 ఎన్నికల్లో చంద్రబాబు నుంచి తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిగా బి.ఫారం అందుకుంటున్న జయచంద్రారెడ్డితో నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు (ఫైల్‌)

నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించే పన్నాగం 

ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల దోపిడీకి కూటమి పెద్దల కుట్ర 

ప్రధాన పాత్రధారి టీడీపీ నేత జయచంద్రారెడ్డి 

కీలక పాత్రధారులు సురేంద్ర నాయుడు, జనార్దనరావు 

పంపిణీదారులు టీడీపీ సీనియర్‌ నేతల కుటుంబ సభ్యులే  

వారిని విచారించని సిట్‌.. ముఖ్యనేత డైరెక్షన్‌లో డైవర్షన్‌ కుట్ర

సాక్షి, అమరావతి: టీడీపీ పెద్దలే సూత్రధారులు, పాత్రధారులుగా సాగుతున్న నకిలీ మద్యం మాఫి­యాకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఐదేళ్లలో రూ.45 వేల కోట్లు కొల్లగొట్టే పన్నాగానికి పాల్పడిన ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కుతంత్రం పన్నింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్‌ను బేఖాతరు చేస్తూ టీడీపీ వీర విధేయ అధికారులతో కూడిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(సిట్‌)ను రంగంలోకి దించింది. డైవర్షన్‌ డ్రామాలో భాగంగానే వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు రాములను ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేసింది. ప్రజల్ని, న్యాయస్థానాన్ని తప్పు­దారి పట్టించేందుకు కూటమి ప్రభుత్వం బరితెగించి కుట్రకు పాల్పడింది.

రాష్ట్రంలో బట్టబయలైన నకిలీ మద్యం మాఫియా వెనుక అసలు సూత్రధారులు టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే అన్నది ఆధారాలతో సహా బట్టబయలైంది. కుటీర పరిశ్రమ తరహాలో ఆఫ్రికా మోడల్‌ నకిలీ మద్యం తయారీ యూనిట్లు నెలకొ­ల్పడం, దర్జాగా సరఫరా, విక్రయాల వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయి. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల దోపిడీకి 2024 ఎన్నికలకు ముందే పక్కా పన్నాగం పన్నారు. అందుకే మాజీ ఎమ్మె­ల్యేలు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, శంకర్‌ యాదవ్‌లను కాదని 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ టికెట్‌ను జయచంద్రారెడ్డికి ఇచ్చారు. నకిలీ మద్యం మాఫి­యాలో ఆయనే కీలక పాత్రధారి కావడం గమనార్హం. ఇక జంట హత్యల కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు గతంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్షమాభిక్ష  ప్రసాదించింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్‌ లభించిందన్నది బహిరంగ రహస్యం. 

ఆ ముగ్గురూ టీడీపీ ముఖ్యులకు సన్నిహితులు
నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దనరావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు, పార్టీ బీ.ఫారం ఇచ్చిన­ప్పుడు ఆయన కూడా ఉన్నారు. బీ.ఫారం స్వీక­రించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. కాగా జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫాం ఇస్తున్నప్పుడు జనా­ర్దనరావు పక్కనే ఉండటం చూస్తుంటే ఆయన వారి­కి ఎంతటి సన్నిహి­తుడన్నది స్పష్టమవుతోంది. నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయ­చంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన రావులు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితు­లన్నది ఫొటో, వీడియో ఆధారా­లతో సహా వెలుగు­లోకి వచ్చింది.

అన్నమయ్య జిల్లా ములకలచెరు­వులో బయట పడిన నకిలీ మద్యం మాఫియా వేర్లు రాష్ట్రం అంతటా విస్తరించాయి. టీడీపీ సీనియర్‌ నేతలు ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్య­తలు పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ మద్యం సిండికేట్‌ ద్వారానే నకిలీ మద్యాన్ని దర్జాగా మద్యం దుకా­ణాలు, పర్మిట్‌ రూమ్‌లు, బెల్ట్‌ దుకా­ణాలు, బార్లలో విక్రయిస్తున్నా­రని వెల్లడవ్వడంతో ప్రభుత్వ పెద్దల బండారం బట్ట­బ­య­లైంది. దాంతో బెంబేలెత్తిన ముఖ్య నేత తనకు అలవాటైన రీతిలో ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు డైవర్షన్‌ కుట్రకు పాల్పడ్డారు. 

ఏ1 జనార్దన్‌రావుతో డైవర్షన్‌ వీడియో 
ముఖ్యనేత పొలిటికల్‌ ఫాంటసీ కథతో డైవర్షన్‌ డ్రామాకు తెరతీశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దనరావుతో కుట్ర కథ నడిపించారు.  ముఖ్యనేత అభయం ఇవ్వడంతోనే విదేశాల్లో ఉన్న ఆయన దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యారు. వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌æ చెబితేనే తాను నకిలీ మద్యం దందాకు పాల్పడి­నట్టు అవాస్తవాలు, అభూత కల్పనలు మేళవించి కట్టు కథ వినిపించారు. ఆ వీడియో ఎల్లో మీడి­యాలో మొదట ప్రసారం కావడం గమనార్హం. జోగి రమేష్‌æ పేరు చెప్పాలని కెమెరా వెనుక నుంచి ఓ అధికారి ఆయనకు ఆదేశిస్తున్న మాటలు కూడా ఆ వీడియో రికార్డింగ్‌లో వినిపించడంతో ప్రభుత్వ కుట్ర బయట పడింది.

అసలు అప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ ఖైదీగా జైలుకు తరలించిన నిందితుడు మీడియాతో ఎలా మాట్లాడారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఆ వీడియోలో జనార్దనరావు నకిలీ మద్యం దందాలో ప్రధాన పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డి గురించి గానీ, అప్పటికే అరెస్టు అయిన సురేంద్రనాయుడు గురించి గానీ చెప్పనే లేదు. తద్వారా ప్రభుత్వ పెద్దల కుట్రకు పోలీసులు సహకరించినట్టు స్పష్టమవుతోంది. 

సీబీఐ వద్దు.. పచ్చ సిట్టే ముద్దు
నకిలీ మద్యం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్‌సీపీ నేతలు, నిపుణుల డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సీబీఐ దర్యాప్తు­నకు అప్పగించాలని జోగి రమేష్‌æ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడంతోపాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్‌ను నియమించడం గమనార్హం. సీబీఐ దర్యాప్తు చేస్తే నకిలీ మద్యం దందా సూత్రధారులుగా ఉన్న తమ బండారం బయటపడుతుందన్నదే ప్రభుత్వ పెద్దల ఆందోళన అన్నది సుస్పష్టం.  

టీడీపీ పెద్దల దందాకు సిట్‌ రక్షా కవచం
కీలక పాత్రధారి జయచంద్రారెడ్డి ఎక్కడ?
డిస్టిలరీల ప్రతినిధులను ఎందుకు ప్రశ్నించరు?

ముఖ్య నేత ఆదేశాలతోనే సిట్‌ ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తోంది. నకిలీ మద్యం మాఫియాకు సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న టీడీపీ నేతలను కనీసం ప్రశ్నించేందుకు కూడా సిట్‌ అధికారులు యత్నించక పోవడమే అందుకు నిదర్శనం. ములకలచెరువులో బయట పడిన నకిలీ మద్యం దందా వెనుక ప్రధాన పాత్రధారి టీడీపీ నేత జయచంద్రారెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఆయన్ను దేశానికి రప్పించేందుకు సిట్‌ ప్రయత్నించడమే లేదు. ఆయనకు వ్యతిరేకంగా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయలేదు. ఇక నకిలీ మద్యం దందాకు నిధులు ఎవరు సమకూర్చారన్నది ఆరా తీయడమే లేదు. ప్రధానంగా నకిలీ మద్యం తయారీ కోసం స్పిరిట్‌ను అక్రమంగా ఎలా కొనుగోలు చేస్తున్నారనే విషయంపై దృష్టి పెట్టనే లేదు.

ఎందుకంటే టీడీపీ కీలక నేతల కుటుంబాలు నిర్వహిస్తున్న మద్యం డిస్టిలరీల ముసుగులోనే స్పిరిట్‌ను కొనుగోలు చేస్తున్నందునేనని స్పష్టమవుతోంది. అందుకే ఆ మద్యం డిస్టిలరీల ప్రతినిధులను విచారించేందుకు సిట్‌ ససేమిరా అంటోంది. మద్యం డిస్టిలరీలలో సోదాలు నిర్వహించనే లేదు. ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ కీలక నేతల కుటుంబ సభ్యులను కూడా సిట్‌ ప్రశ్నించనే లేదు. అంటే నకిలీ మద్యం మాఫియా నిర్వహిస్తున్న టీడీపీ పెద్దలకు ‘సిట్‌’ రక్షా కవచంగా నిలుస్తోందన్నది సుస్పష్టం. ఇందులో భాగంగానే నకిలీ మద్యం కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేసింది.

నకిలీ మద్యం తయారీకి అక్రమంగా స్పిరిట్‌ సరఫరా చేస్తున్న టీడీపీ నేతల డిస్టిలరీలలో సోదాలు చేయని సిట్‌ అధికారులు.. జోగి రమేష్‌æ నివాసంలో మాత్రం సోదాలు చేయడం గమనార్హం. నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ నేతల కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చని సిట్‌ అధికారులు.. జోగి రమేష్‌æ సోదరుడు జోగి రామును కూడా అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ కుట్రకు తార్కాణం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement