సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఆలయాలు, దేవుళ్లను రాజకీయాల కోసం వాడుకుంటున్న కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజలు చీదరించుకంటున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీలో అనేక అపచారాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని మండిపడ్డారు.
తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా, రీల్స్ చేస్తున్నా, మద్యం, మాంసాహారం యథేచ్ఛగా కొండమీదకు తీసుకొస్తున్నా టీటీడీ బోర్డు ఏం చేస్తుందో అర్ధం కాని పరిస్థితి నెలకొందని, కూటమి పాలనలో టీటీడీ వ్యవస్థ పూర్తిగా నీరుగారి పోయిందని అన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలోని ఆలయాల నిర్వహణలో నిలువెత్తు నిర్లక్ష్యం చోటు చేసుకుందని.. భక్తులు దైవ దర్శనానికి వెళ్తే ప్రాణాలతో తిరిగొస్తామన్న నమ్మకం లేకుండా పోయిందని గుర్తు చేశారు.
చంద్రబాబు హయాంలో ప్రతిసారి హిందుత్వం మీద దాడి జరగడం పరిపాటిగా మారిందని.. తిరుపతి, అన్నవరం,కాశీబుగ్గ క్షేత్రమేదైనా కూటమి పాలనలో వరుస అపచారాలు చోటుచేసుకుంటున్నా.. భక్తుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మల్లాది విష్టు ఆక్షేపించారు. మరోవైపు రాష్ట్రంలో యధేచ్చగా గోవధ జరుగుతున్నా.. విశాఖ కేంద్రంగా భారీగా గోమాంసం నిల్వలు పట్టుబట్టినా కూటమి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు నిలదీశారు. ప్రెస్‌మీట్‌లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:
తిరుమలలో వరుస అపచారాలు..
తిరుమలలో అధికారులు, విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయింది. టీటీడీ పాలక మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ సభ్యుడు ఏకంగా మహాద్వారం గుండా వెళ్లాలని అక్కడున్న సిబ్బందితో గొడవపడి నానా రాద్ధాంతం చేశారు. మరోవైపు టీటీడీకి చెందిన గోశాల నిర్వహణ దారుణంగా మారింది. అక్కడ తొలిసారిగా దాదాపు 190 గోవులు మరణించడం అత్యంత బాధాకరం.
అదే విషయాన్ని వైయస్సార్సీపీ నాయకులు ఎత్తి చూపితే.. వారి మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారు. కానీ అదే టీటీడీ పాలకమండలి సమావేశంలో గోశాల నిర్వహణ కష్టంగా ఉందని చర్చించడం ద్వారా మేం చెప్పిన అంశం నిజమేనని రుజువైంది. మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం టీటిడీని రాజకీయ విమర్శలకు వేదికగా దుర్వినియోగం చేస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్ 12న వసంతోత్సవంలో భాగంగా అర్చక స్వాములు స్వామివారికి నైవేద్యం తీసుకెళ్తున్న సమయంలో స్వామివారి గేటు తాళాలు మూసివేయడంతో స్వామివారి నైవేద్య సమర్పణ 15 నిమిషాలు ఆలస్యమైంది. ఇది ఘోరమైన అపచారం. పాలకమండలి పాలనా, నిర్వహణ వైఫల్యానికి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. అసలు తిరుమలలో వ్యవస్థ పని చేస్తుందా? లేదా? అన్న సందేహం కలిగేలా వ్యవహరిస్తూ కొంతమంది చెప్పులు వేసుకుంటూ వైకుంఠం క్యూ కాంప్లెక్ లోకి వెళ్తున్న ఘోర తప్పిదాలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం హిందూధర్మ పరిరక్షణకు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం.
దేవాలయాల్లో వరుస అపచారాలు..
కూటమి ప్రభుత్వం తరహాలో వైయస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఏరోజూ ఇలా జరగలేదు. కానీ 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం నిత్యం దేవుళ్లని, హిందూ ధర్మాన్ని అడ్డుపెట్టుకుని దేవుడితో రాజకీయాలు చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి. సాక్షాత్తూ సుప్రీంకోర్టు స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదిక చేయెద్దని రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసినా.. చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. టీటీడీకి సంబంధించిన వ్యవహారాలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం.. లడ్డూ తయారీ నెయ్యిలో లేని కల్తీ జరిగిందని సిట్ దర్యాప్తు వేసి.. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దాన్ని వాడుకుంటోంది.
అదే విధంగా కాశీనాయన క్షేత్రంలో గోశాల, అన్నదాన సత్రం, భక్తుల విశ్రాంతి భవనాలను టైగర్ రిజర్వ్ జోన్ లో ఉందని.. అత్యంత అమానుషంగా బుల్‌డోజర్లతో కూలగొట్టారు. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారు. వైయస్.జగన్ హయాంలో అయితే ఇదే కాశీనాయన క్షేత్రానికి సంబంధించి అటవీ భూముల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖ మంత్రికి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వానికి, వైయస్.జగన్ ప్రభుత్వానికి ఇదే తేడా.
వైయస్. జగన్ హయాంలోనే పరకామణి కోసం అత్యాధునిక వసతులతో కొత్త భవనాన్ని నిర్మించారు. కాబట్టే పరకామణి చోరీ వ్యవహారం బయటపడింది. అయితే ఈ కేసులో మాజీ ఏవీఎస్ సతీష్ వేధింపులకు ఎవరు కారణం?, ప్రభుత్వ వేధింపులు కాదా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయాల నిర్వహణ అత్యంత అధ్వాధ్నాంగా తయారైంది. కేవలం టీటీడీ, కాశీనాయన క్షేత్రాల్లోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అలయాల్లోనూ ఇవే అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. 01–05–2025న సింహాచలం దేవస్దానంలో గోడకూలి 7 మంది సజీవసమాధి అయితే దానికి ఎవరు బాధ్యత వహించారు? ఎవరి మీద చర్య తీసుకున్నారు? పర్వదినాన దర్శనానికి వచ్చిన భక్తులు ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పేతే ఎవరు జవాబూదారీతనం
రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో అసాంఘిక కార్యకలాపాలకు విపరీతంగా పెరిగిపోతున్నా.. పట్టించుకునే నాధుడు లేకుండా పోతుంది. కోడిగుడ్లు తినడం, మద్యపానం, పేకాట వంటివి అష్టాదశ శక్తిపీఠ శ్రీశైలంలో విపరీతంగా పెరిగిపోయాయి. పైగా కూటమి ఎమ్మెల్యే తప్పతాగి, స్వయంగా అటవీశాఖ సిబ్బంది మీద దాడులకు దిగడమేనా సనాతన ధర్మం. ఈ ఏడాది మే 18న శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం అద్దేపల్లిపేటలో కోదండరామాలయంలో ఘోర అపచారానికి పాల్పడ్డారు. కల్కి, బలరాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి విగ్రహాలను ధ్వంసం చేసి పక్కన పడేశారు. నిందితులను ఇంతవరకు పట్టుకోలేదు, దాని మీద ఎలాంచి చర్యలు లేవు.
ఈ ఏడాది నవంబరు 11న కాశీబుగ్గలో కార్తీక ఏకాదశి నాడు భక్తులు భారీగా వస్తారని తెలిసినా.. కనీస పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదు. వేలాదిమంది భక్తులు దర్శనానికి రావడంతో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. గుడికి వెళ్తే తిరిగిప్రాణాలతో వస్తామో? రామో? అన్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అలాగనే పక్కనే ఉన్న శ్రీకూర్మంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల... నక్షిత్ర తాబేళ్లు చనిపోతే కనీసం పోస్టుమార్టమ్ కూడా నిర్వహించకుండా ఈవో కార్యాలయం వెనుక వాటిని తగలబెట్టారు. ఇవన్నీ మీ పరిపాలనకు మచ్చుతునకలు.
రామతీర్థంలో శ్రీరాముడి తల నరికిన వ్యక్తికి ప్రభుత్వ నిధుల నుంచి రూ.5 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇచ్చారా? లేదా? ఈ రకమైన కార్యక్రమాలు చేస్తుంది. 2024–25 లో హిందూ ధర్మాన్ని కూటమి ప్రభుత్వం ఎంతటి దుస్థితికి దిగజార్చిందనడానికి ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే. తిరుపతిలో తొక్కిసలాటలో గతేడాది 6గురు చనిపోయారు. దానికి కారణమైన అధికారులను మరలా అదే స్ధానంలో నియమించారు. రెండు రోజుల క్రితం 24, 25 తేదీల్లో మరలా తొక్కిసలాట జరిగింది. మీకు అనుకూలంగా పని చేసే అధికారులు తప్పు చేసినా వారి మీద చర్యలు ఉండవన్నది స్పష్టమవుతోంది.
సదావర్తి భూములను వేద పండితుల పోషణ కోసం ఇచ్చారు. అని అన్యాక్రాంతం కాకుండా వైయస్సార్సీపీ ప్రభుత్వం కాపాడింది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో భక్తుల కానుకులు వేసిన హుండీలకు కూడా భద్రత లేదు. అహోబిలంలో రూ.20 లక్షలు భక్తులు వేసిన కానుకలని స్థానిక ఎమ్మెల్యే మనుషులు కైంకర్యం చేస్తే.. కనీసం కేసు కూడా పెట్టలేదు. దేవాలయాల్లో పెరిగిన రాజకీయ జోక్యానికి ఇదే నిదర్శనం. ఆలయాల్లో చొరబడి రాజకీయజోక్యంతో నాశనం చేస్తున్నారు.
వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామిని చిన్నతిరుపతిగా పేరు గాంచింది. 19–11–2025న హుండీ లెక్కింపుల్లో వాసంశెట్టి శ్రీనివాసరావు... మంత్రి వాసంశెట్టి సుభాష్ సిఫారసుతో వచ్చి.. డబ్బులు దొంగతనం చేస్తే కేసు పైలు చేశారు. దీని మీద కూటమి నేతలు నోరు మెదపరు. ఇవన్నీ ఈ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అరాచకాలు.
ఇవీ కూటమి ప్రభుత్వ ఘనతలు:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలయాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. వారి భద్రతకు చర్యలు తీసుకోకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాదాయధర్మాదాయ శాఖ అధికారులు భక్తుల ప్రాణాలను గాల్లో వదిలేసింది. రాష్ట్రంలో వివిధ ఆలయాల నిర్వహణ కోసం, వేదపండితులు పోషణ కోసం దేవాలయాలకు భూములిస్తారు. అయితే ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఒక జీవో ప్రకారం ఆలయాల భూములను తమకు తూచినట్లు, టెండర్లు లేకుండానే తమకు నచ్చిన వారికి కట్టబెట్టే విధంగా జీవో జారీ చేసింది. ఇది ఏ మేరకు ధర్మం? వైఎస్ జగన్ హయాంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూశారు. కానీ ఈ ప్రభుత్వం వాటిని దోచిపెట్టే పని చేస్తోంది.
రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవస్థానం అయిన.. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో.. 70 వేల మంది భక్తులున్న ఆలయంలో 3 నుంచి 4 గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేసారంటే ఈ ప్రభుత్వ అసమర్థత ఏంటో అర్ధం అవుతుంది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? దేవాదాయ, ధర్మాదాయ మరియు విద్యుత్ శాఖలకు మధ్య ఉన్న సమన్వయలోపానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వ అసమర్థ పాలనకు తార్కాణం. అనంతపురం సింగనమలలో పుట్ పాత్ మీద సిరి రమణ అనే ఒక అర్చకుడు ఆందోళనకు దిగాడు. 150 ఏళ్లుగా వంశపారపర్యంగా ఆలయ అర్చకత్వం చేస్తుంటే.. వారిని గుడి నుంచి గెంటేస్తే.. పోలీసులకు ఫిర్యాదు చేసినా, కలెక్టర్ కు అర్జీ ఇచ్చినా పట్టించుకోకపోవడం అత్యంత అమానుషం.
ద్వారకా తిరుమలలో సైతం ప్రభుత్వ అసమర్థ నిర్వహణ వల్లే గోవులు చనిపోతే.. దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. కూటమి పాలన వచ్చిన తర్వాత విశాఖపట్నం వేదికగా పెద్ద మొత్తంలో గోమాంసం విదేశాలకు ఎగుమతి అవుతుంది. హిందూ సమాజానికి జరుగుతున్న అతిపెద్ద ద్రోహం ఇది. బాపట్ల ఎమ్మెల్యే సన్నిహితుడు గోడౌన్ లో పట్టుబడినా చర్యలు శూన్యం. తూతూ మంత్రంగా ఇద్దరిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. కర్నూలులో లే అవుట్ కి అడ్డంగా ఉందని అలయ గోడ కూల్చి వేసిన ఘటన చోటు చేసుకుంది.
ఇంకా టీడీపీ ఎమ్యెల్యే ఒకరు బహిరంగంగా భగవద్గీతను అవమానించారు. ఎన్టీఆర్ జిల్లా నారికంపాడులో ఆలయానికి చెందిన 28 ఎకరాలను 22–ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించమని హైకోర్టు ఆదేశిస్తే, మొత్తం 1036 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం జిల్లా రిజిస్టార్‌కు లేఖ రాసింది. అంటే కోర్టు ఆదేశాన్ని చూపి, మొత్తం భూమిపై కన్నేసి.. అలా ఆలయ ఆస్తుల రిజిస్టర్‌లో ఇనాం, ఎస్టేట్ భూములని చూపి, దాన్ని స్వాహా చేయడానికి కుట్ర చేశారు. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.1000 కోట్లు.
వైఎస్ జగన్ హయాంలో దేవాదాయశాఖలో సంస్కరణలు:
వైఎస్ జగన్ హయాంలో ఆలయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తిరుమలలో శ్రీవాణి పథకం ద్వారా భక్తులు దర్శనాలు చేసుకుంటే.. దానిపైనా విమర్శలు చేసి ఆనేక ఆరోపణలు చేశారు. ఆ పథకాన్ని ఎన్నికల ముందు రద్దు చేస్తామని ప్రకటించి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నే కొనసాగిస్తున్నారు. అంటే వీరు చేసినవన్నీ అబద్దపు ఆరోపణలనే తేలింది. మరోవైపు చంద్రబాబు హయాంలో గతంలో విజయవాడలో కూలగొట్టిన ఆలయాలన్నింటినీ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తిరిగి నిర్మించారు. అసలైన హిందూ పరిరక్షకులు ఎవరన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మల్లాది విష్ణు స్పష్టం చేశారు.


