
రాష్ట్రానికి దాదాపు ముప్పైమంది ఎంపీలున్నారు.. మీరంతా ఎందుకున్నట్లు?.. సిగ్గుందా? లజ్జ ఉందా?? మీకసలు పౌరుషం లేదా??? పౌరుషం కావాలంటే కాసింత గొడ్డుకారం తినండి! ఒంటికి రాసుకోండి!!.. అప్పుడైనా మీకు పౌరుషం వస్తుందేమో..!!! విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేస్తుంటే ఈ వైఎస్సార్‌సీపీ వాళ్లెం చేస్తున్నారు? ఇదేనా మీ నైతికత.. ఇదేనా మీ బాధ్యత .. అదే నేను ఉండుంటే ఢిల్లీవాళ్ళు ఇలాగె చెలరేగిపోయేవాల్లా.. ఖచ్చితంగా నేను ఆ ప్రయివేటీకరణంను ఆపేసేవాణ్ని..
ఎన్నికలకు ముందు చిందులు తొక్కిన పవన్.. నేడు ఆ అంశాన్ని మెల్లగా సైడ్ చేసేసారు. విశాఖలో మూడురోజులపాటు పార్టీ నేతలు.. కార్యకర్తలతో సమావేశాలు అంటూ హడావుడి చేసిన పవన్ తనలోని అసలైన రాజకీయ నాయకున్ని బయటకు తీశారు. ఎప్పట్లానే పదిహేనేళ్ళు మళ్ళా తెలుగుదేశంతో కలిసి సాగుతానని అన్నారు. దానికి కార్యకర్తలు.. నాయకులు తలూపాలని చెప్పేశారు.
పదవులు ముఖ్యం కాదని.. సమాజమే ప్రధానమని... దేశోద్ధారణకు పార్టీ ఏర్పాటు చేసానని చెప్పేసారు. తనకు తన అన్న నాగబాబుకు పదవులు వచ్చాయి కాబట్టి అలాగే అంటాడు. కానీ గ్రామ.. మండల స్థాయిల్లో పని చేస్తున్న కార్యకర్తలు.. నాయకుల పరిస్థితి ఏమిటని ? తమను తెలుగుదేశం వాళ్ళు సెకెండ్ గ్రేడ్ పౌరుల్లా చూస్తున్నారని లోలోన జనసైనికులు కుమిలిపోతున్నా ఆ సౌండ్ బయటకు రాకుండా చేతులు అడ్డం పెట్టుకున్నారు.

మరోవైపు ఉత్తరాంధ్ర ఎమోషన్ అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ లోని కీలక విభాగాలను ప్రయివేటుకు అప్పగిస్తూ ఇటీవల కేంద్రం వేసిన నోటిఫికేషన్ గురించి పవన్ ఎక్కడా కిక్కురుమనలేదు. అసలు ఆ విషయాన్నీ కూడా జనంలోకి రాకుండా కవర్ చేయడానికి తాపత్రయపడ్డారు. మరోవైపు సుగాలీ ప్రీతి హత్య గురించి ఎన్నికలకు ముందు గంగవెర్రులెత్తిన పవన్ ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారని, ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ తమకు న్యాయం చేయకపోతే జనసేన ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.
తాము అధికారంలోకి వస్తే మొదట ఓపెన్ చేసేది సుగాలి ప్రీతి కేసు అని... అప్పట్లో చెప్పిన పవన్ ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ మీద కూడా ఎక్కడా ప్రస్తావించకుండా వైయస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలు చూడ్డానికి వెళ్లారు. అందులో సీలింగ్‌కు వేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్నిచోట్ల ఊడిందని చెబుతూ రాద్ధాంతం చేస్తున్నారు. అటు వేలకోట్ల విలువైన ఉక్కుపరిశ్రమ గురించి మాట్లాడకుండా ఇలాంటి చిల్లర విషయాలు ప్రస్తావిస్తూ ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేస్తూ ఇలా పూటగడిపేస్తున్నారని విశాఖలోని యువత దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తానికి మూడురోజుల పవన్ ప్రోగ్రాం సొంత డబ్బా కొట్టుకోవడానికి .. చంద్రబాబును కాపాడ్డానికి ఉపయోగపడిందని అంటున్నారు..
:::సిమ్మాదిరప్పన్న