అంగన్‌వాడీ హెల్పర్ ఇంద్రజపై దాడి చేస్తున్న టీడీపీ వర్గీయులు
అంగన్‌వాడీ హెల్పర్‌పై టీడీపీ వర్గీయుల దుశ్శాసన పర్వం
అనంతపురం సెంట్రల్/సాక్షి, పుట్టపర్తి: పేరులో రాముడు ఉన్న రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో ఆటవిక రాజ్యం నడుస్తోంది..! రాక్షసత్వం రాజ్యమేలుతోంది..! రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ఇక్కడ అరాచకం పేట్రేగుతోంది..! స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో పచ్చమూకలు చెలరేగుతున్నాయి! కొత్తగాదికుంటలో పొలాలు దున్నేయడం.. పేరూరులో దళిత బాలికపై సామూహిక అత్యాచారం.. పాపిరెడ్డిపల్లిలో బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్య దారుణ హత్య.. మహిళా ఎంపీటీసీ సభ్యురాలి కిడ్నాప్..! ఇలా ఒకటేమిటి..? అనేక దారుణాలు జరుగుతున్నాయి..! తాజాగా అంగన్‌వాడీ హెల్పర్‌పై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
మహిళా ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మహిళలకే రక్షణ కరువైంది..! వివరాల్లోకి వెళ్తే.. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం మంగాపురం గ్రామంలో ఇంద్రజ 2019 నుంచి అంగన్‌వాడీ హెల్పర్‌గా పనిచేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అదే గ్రామానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త గొళ్ల శ్రీనివాసులు కుమారుడు విష్ణు హెల్పర్ పోస్టు తమవారికి కావాలని రాజీనామా చేయాలని ఇంద్రజను బెదిరిస్తున్నాడు.
ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ అండ చూసుకుని వేధించసాగాడు. రోజూ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లడం, సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపడం చేస్తున్నాడు. ఇతడి ఆగడాలపై ఏడాది క్రితమే ఇంద్రజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ పెద్దగా పట్టించుకోకుండా రాజీ చేసి పంపారు. తర్వాత కూడా ఇంద్రజకు వేధింపులు ఆగలేదు.
పట్టపగలే ఇంట్లోకి చొరబడి...
ఈ క్రమంలో బుధవారం పట్టపగలే గొళ్ల శ్రీనివాసులు, విష్ణు, అతడి భార్య నాగమ్మ, బావమరిది ఓబయ్యలు ఇంద్రజ ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెను, భర్త నరసింహమూర్తిని చెప్పులు, కట్టెలతో కొట్టారు. చీర పట్టుకుని బయటకు లాక్కెళ్లి చీపురుతో కొట్టారు. ఈడ్చుకెళ్లి కాళ్లతో తన్నుతూ చితకబాదారు. రాజీనామా చేయకపోతే చంపుతామని బెదిరింంచారు. ఇంద్రజ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. నరసింహమూర్తి అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎస్‌ఐ లేరు.. కేసు తీసుకోం...
ఇంద్రజ దంపతులపై దౌర్జన్యం జరిగి 24 గంటలైనా, టీడీపీ వర్గీయులు ఇంద్రజ ఇంటిపై దాడి చేసిన వీడియోలు, ఆమె తీసిన సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో వైరలైనా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా ఘటనపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం రామగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ లేరని, కేసు తీసుకోబోమని పోలీసులు చెప్పడం గమనార్హం. దిక్కుతోచని స్థితిలో బాధితురాలు ఇంద్రజ సెల్ఫీ వీడియో ద్వారా గురువారం సాయంత్రం తనపై జరిగిన దాడిని వెల్లడించారు.
నిందితుడిపై గతంలోనూ ఫిర్యాదులు
టీడీపీ కార్యకర్త గొళ్ల విష్ణు నెల రోజుల క్రితం గ్రామానికి చెందిన దళితుడిని చితకబాదాడు. అప్పుడు కూడా పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. దీన్నిబట్టే రాప్తాడు నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. ఎమ్మెల్యే సునీత అండతో విష్ణు పోలీసుల నుంచి రక్షణ పొందుతున్నట్లు సమాచారం. పోలీసులు సైతం ఏకపక్షంగా అధికార పార్టీ వారి వైపే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
చంద్రబాబు సర్కారు వచ్చిన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు ఎక్కువయ్యాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళా ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడులో, అదికూడా పరిటాల సునీత సొంత మండలంలో ఇప్పటికే గ్యాంగ్ రేప్ జరిగింది. తాజాగా మంగాపురంలో అంగన్‌వాడీ హెల్పర్‌పై దాడి చేయడం బాధాకరం. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి.
– తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
హోంమంత్రిగా మహిళ.. కానీ, మహిళలకు రక్షణ కరువు
రాష్ట్ర హోం మంత్రిగా అనిత, జిల్లా మంత్రిగా సవిత, రాప్తాడు ఎమ్మెల్యే సునీత ఇలా అందరూ మహిళలే. కానీ, రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది. మంత్రులు, ఎమ్మెల్యే సునీతలు మంగాపురంలో అంగన్‌వాడీ హెల్పర్‌పై దాడి ఘటన మీద స్పందించాలి. దుర్మార్గంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలి.
– ఉషశ్రీ చరణ్, వైఎస్సార్‌సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు
టీడీపీ వారినుంచి మా కుటుంబానికి ప్రాణహాని
మా ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేస్తామంటున్నారు
మిమ్మల్ని బతకనీయమని బెదిరిస్తున్నారు: ఇంద్రజ
టీడీపీ అధికారంలోకి వచ్చాక గ్రామానికి చెందిన ఆ పార్టీ నాయకులు నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. హెల్పర్ పోస్టు వదిలిపెట్టాలని వేధిస్తున్నారు. గొళ్ల విష్ణు రాత్రివేళ ఫోన్లతో పాటు అసభ్య మెసేజ్‌లు పెడుతున్నాడు. నేరుగా అంగన్‌వాడీ సెంటర్‌కి వచ్చి దౌర్జన్యానికి దిగుతున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మా ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేస్తామని, మిమ్మల్ని బతకనీయమని బెదిరిస్తున్నారు. వారితో మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. పోలీసు ఉన్నతాధికారులే కాపాడాలి.


