మళ్లీ కర్రలే పాతారు!
కళ్యాణదుర్గం: బీటీపీ కాలువ పనుల్లో ఎస్‌ఆర్‌సీ సంస్థ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. కాలువ పనుల్లో భాగంగా కళ్యాణదుర్గం సమీపంలోని ఒంటిమిద్ది వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో కళ్యాణదుర్గం– అనంతపురం ప్రధాన రహదారి వద్ద రోడ్డు డైవర్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే వాహనదారులను అప్రమత్తం చేసేలా ఎటువంటి కోన్స్ సూచికలు ఏర్పాటు చేయకుండా ఒక వైపు కర్రలు పాతి, టేపు వేయడం, మరోవైపు విస్మరించడంపై ఈ నెల 9న ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ప్రమాదకరంగా ఉన్న కాలువ పనుల వద్ద మరోవైపు కూడా రక్షణ కోన్స్‌కు బదులుగా మళ్లీ కర్రలే పాతి టేప్ వేశారు. ఎస్‌ఆర్‌సీ సంస్థ, నేషనల్ హైవే అధికారులకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా అంటూ వాహనదారులు మండిపడుతున్నారు.
శతాధిక వృద్ధుడు మృతి
కణేకల్లు: మాల్యం గ్రామంలో శతాధిక వృద్ధుడు టైలర్ మాబుసాబ్ (103) ఆదివారం వేకువజామున మృతి చెందారు. మాబుసాబ్ మాల్యం, కళేకుర్తి గ్రామాల్లో పోస్ట్‌మెన్‌గా పని చేశారు. 1922లో జన్మించిన ఈయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు, మునిమనవరాళ్లు ఉన్నారు. మూడు నెలల క్రితం వరకు ఆయన స్వయంగా నడిచేవారని, అన్నం తినేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. వయోభారం కారణంగా ఆదివారం వేకువజామున ఇంట్లో ఆయన ప్రాణం విడిచారు. రిటైర్డ్ పోస్ట్‌మెన్ కావడంతో అనేకమంది ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
పోక్సో కేసులో
‘అనంత’ వాసికి రిమాండ్
బత్తలపల్లి: మండలంలోని ఓ గ్రామంలో గత ఏడాది నవంబర్ 15న ప్రేమ పేరుతో బాలికను మోసగించిన కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్ తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. ప్రేమ పేరుతో బాలికను మోసగించిన యువకుడితో పాటు యువకుడి తండ్రి, ఆశ్రయం ఇచ్చిన మరో వ్యక్తిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే యువకుడితో పాటు అతని తండ్రిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపామన్నారు. ఆశ్రయం ఇచ్చిన అనంతపురంలోని కేకే కాలనీకి చెందిన ఈడిగ ప్రదీప్‌కుమార్‌ను ఆదివారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
మళ్లీ కర్రలే పాతారు!


