సర్కారు స్థలం.. అధికార పార్టీలో కయ్యం | - | Sakshi
Sakshi News home page

సర్కారు స్థలం.. అధికార పార్టీలో కయ్యం

Jan 12 2026 7:23 AM | Updated on Jan 12 2026 7:23 AM

సర్కా

సర్కారు స్థలం.. అధికార పార్టీలో కయ్యం

అనంతపురం ఎడ్యుకేషన్‌: అధికార తెలుగుదేశం పార్టీ నేతల భూ దందాలు పరాకాష్టకు చేరాయి. ఎవరి ఖాళీ స్థలాన్ని ఎవరు ఆక్రమిస్తారోననే భయం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా అనంతపురం నగర శివారులోని భూముల ధరలకు రెక్కలు రావడం, అంతేస్థాయిలో ఖాళీ స్థలాలు కూడా ఎక్కువగా ఉండడంతో వివాదాలు సృష్టిస్తూ కబ్జా చేసే ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సుమారు రూ.4 కోట్ల స్థల వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన వారిమధ్య ఈ వివాదం నడుస్తుండడం గమనార్హం. అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ప్రధాన అనుచరుడు గంగారామ్‌ నేతృత్వంలో ఫెన్సింగ్‌ వేసి కబ్జా చేయాలని చూస్తున్నారంటూ స్వయంగా టీడీపీకి చెందిన వీరశైవ లింగాయత్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ స్వప్న ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. అయితే ఈమెకు ఏమాత్రమూ సంబంధం లేదని, అది పంచాయతీ స్థలం అంటూ అధికారులు ప్రకటించి ట్విస్ట్‌ ఇచ్చారు.

ఇదీ అసలు కథ...

ఎ.నారాయణపురం పొలం 179 సర్వే నంబరు (తపోవనం శివారు గాయత్రి ఆలయ సమీపం) లో 43 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ సెంటు స్థలం ధర రూ.10 లక్షల దాకా ఉంది. ఈ లెక్కన రూ. 4 కోట్లకు పైగా విలువ చేస్త్తోంది. ఈ స్థలంలో ఇటీవల కొందరు ఫెన్సింగ్‌ వేశారు. అదే సమయంలో అక్కడున్న వారితో టీడీపీ నాయకురాలు, వీరశైవ లింగాయత్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ స్వప్న ఫోన్‌లో సంప్రదించారు. ‘అది మా బంధువుల స్థలం. మీరెందుకు ఫెన్సింగ్‌ వేస్తున్నారు’ అని స్వప్న ప్రశ్నించగా.. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌, గంగారామ్‌ పేర్లు చెప్పారు. ఆమె నేరుగా ఎమ్మెల్యేకు ఫోన్‌ చేయగా.. తాను ఊరిలో లేనని, వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పారు. అనంతరం గంగారామ్‌కు ఫోన్‌ చేసి పనులు ఆపేయాలంటూ ఆమె కోరారు. మరి ఏమి జరిగిందో ఏమో కానీ ఫెన్సింగ్‌ మాత్రం పూర్తయిపోయింది.

నేరుగా రంగంలోకి దిగిన స్వప్న.

ఆదివారం మధ్యాహ్నం స్వప్న అనుచరులు, బంధువులతో కలిసి నేరుగా 43 సెంట్ల స్థలం వద్దకు చేరుకున్నారు. ఫెన్సింగ్‌ మొత్తం ధ్వంసం చేయించారు. ఈ స్థలం ‘జీటీ నాగప్ప కుటుంబానికి చెందినది’ అంటూ నోటీసు బోర్డు నాటించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి, గంగారామ్‌ పేర్లు చెప్పి మాస్థలానికి ఫెన్సింగ్‌ వేశారంటూ ఆరోపించారు.

ట్విస్ట్‌ ఇచ్చిన పంచాయతీ అధికారులు..

ఇద్దరి మధ్య వివాదం నడుస్తున్న ఈ స్థలంపై పంచాయతీ అధికారులు బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. అది ఎవరికీ సంబంధం లేదని, పూర్తిగా పంచాయతీ స్థలం అని తేల్చారు. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ ఇటీవల రెవెన్యూ అధికారులకు పంచాయతీ అభివృద్ధి అధికారి స్వయంగా లేఖకూడా రాశారు. కాగా ఆదివారం సాయంత్రం పంచాయతీ సిబ్బంది అక్కడికి వెళ్లి స్వప్న నాటించిన బోర్డును పీకేశారు. ‘ఇది ఎ.నారాయణపురం గ్రామ పంచాయతీకి చెందిన స్థలం, ఎవరైనా అతిక్రమిస్తే శిక్షార్హులు’ అని బోర్డు ఏర్పాటు చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే విలువైన ప్రభుత్వ స్థలంపై సంబంధం లేని ఎమ్మెల్యే అనుచరులు, వీరశైవ లింగాయత్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ స్వప్న కన్నేసినట్లు స్పష్టమవుతోంది.

రూ.4 కోట్ల స్థలం కబ్జాకు

అధికార పార్టీ నేతల కుట్ర

తమదేనంటూ ఫెన్సింగ్‌ వేసిన అర్బన్‌ ఎమ్మెల్యే అనుచరులు

అది తమ బంధువులదంటూ ఫెన్సింగ్‌ ధ్వంసం వేయించిన ‘వీరశైవ లింగాయత్‌’ చైర్‌పర్సన్‌ స్వప్న

ఆ స్థలం పంచాయతీది అంటూ ట్విస్ట్‌ ఇచ్చి బోర్డు ఏర్పాటు

చేయించిన అధికారులు

అది పంచాయతీ స్థలమే..

సర్వే నంబరు–179లో 43 సెంట్ల ఖాళీ స్థలం ఎ.నారాయణపురం గ్రామ పంచాయతీకి చెందినదే. ఎవరికీ సంబంధం లేదు. ఫెన్సింగ్‌ కూడా మేమే వేయించాం. అలాంటి ప్రభుత్వ భూమిలో కొందరు వెళ్లి ఫెన్సింగ్‌ తొలగించి బోర్డు నాటారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం కల్గించడంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయిస్తాం. నిజంగా వారిదే స్థలమైతే సంబంధిత ఆధారాలతో ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలి. అంతేకానీ ఇలా స్థలంలోకి రావడం సరికాదు. – శ్రీధర్‌రావు,

పంచాయతీ అభివృద్ధి అధికారి,

ఎ.నారాయణపురం

సర్కారు స్థలం.. అధికార పార్టీలో కయ్యం1
1/2

సర్కారు స్థలం.. అధికార పార్టీలో కయ్యం

సర్కారు స్థలం.. అధికార పార్టీలో కయ్యం2
2/2

సర్కారు స్థలం.. అధికార పార్టీలో కయ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement