ధాన్యం.. దళారుల భోజ్యం! | AP Farmers Effect on Still Mentha Tufan | Sakshi
Sakshi News home page

ధాన్యం.. దళారుల భోజ్యం!

Nov 28 2025 2:48 AM | Updated on Nov 28 2025 2:50 AM

AP Farmers Effect on Still Mentha Tufan

పంట కొనుగోలులో పూర్తిగా చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం 
మిల్లర్లు, దళారుల ఇష్టారాజ్యానికి పచ్చ జెండా  

రెండు మూడు గ్రామాలను ఓ దళారికి అప్పగించిన వైనం 

గోనె సంచులు లేవు.. టార్పాలిన్లు లేవు.. రవాణా వాహనాలు లేవు.. కొనుగోలు కేంద్రాలు లేవు..  

అన్నీ దళారుల గుప్పిట్లోనే.. వారు చెప్పిందే రేటు 

అతి తక్కువ ధరకు అడుగుతూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్న దుస్థితి 

మిల్లులోకి రైతు నేరుగా ప్రవేశించే పరిస్థితే లేదు 

ఏ దశలోనూ కనిపించని సర్కారు పర్యవేక్షణ  

పంట కొనుగోలు చేద్దామనే చిత్తశుద్ధి అంతకంటే లేదు 

ఉత్సవ కేంద్రాలుగా మారిన ఆర్బీకేలు, సొసైటీలు 

వెరసి 75 కిలోల బస్తాకు రూ.400–500 నష్టపోతున్న రైతులు  

సర్కారు కుట్రలకు తోడు తుపాను హెచ్చరికలతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన  

ఈ చిత్రంలో కనిపిస్తున్న ధాన్యం ఆరబోసిన దృశ్యం చంద్రబాబు క్యాబినెట్‌లోని మంత్రి పార్థసారథిని అవాక్కయ్యేలా చేసింది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంబాడు గ్రామం నుంచి పామర్రు సెంటరు–గుడివాడ వెళ్లే రహదారిలో ఈ దృశ్యం కనిపించింది. కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోంది. వ్యవసాయ కుటుంబాలన్నీ రోడ్లపై ధాన్యాన్ని పోసి పగలంతా ఆరబెట్టుకోవడం.. రాత్రి అయితే అక్కడే చలిలో కాపలా ఉండటం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులు 75 కిలోల బస్తాను రూ.వెయ్యికి కొనుగోలు చేస్తున్న దుస్థితి. బుధవారం ఈ రహదారిలో వెళ్తున్న మంత్రి పార్థసారథి రోడ్లపై ధాన్యాన్ని చూసి కారు దిగేసరికి.. అన్నదాతలు ఆయన్ను చుట్టుముట్టి నిలదీశారు. మిల్లర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వాహనాలు రాక ధాన్యం కొనుగోలు చేయట్లేదని, రంగు మారిన ధాన్యాన్ని తీసుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని వాపోయారు. మంత్రి జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి రైతులకు నష్టం వాటిల్లకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

మోంథా తుపానుతో అతలాకుతలమైన ధాన్యం రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం డబుల్‌ గేమ్‌ అడుతోంది.. ఓ వైపు నష్టపోయిన రైతులకు రూపాయి పరిహారం ఇవ్వకపోగా, ఇప్పుడు అంతంత మాత్రంగా చేతికందిన పంటను కొనుగోలు చేయడంలో దళారులకు మేలు జరిగేలా అంతర్గతంగా సహకరిస్తోంది.. రంగు మారిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పి.. నిర్దయగా తిరస్కరిస్తోంది.. గోనె సంచులు లేవు.. టార్పాలిన్లు లేవు.. రవాణా వాహనాలు లేవు.. కొనుగోలు కేంద్రాలు లేవు.. ఈ ఇబ్బందులన్నీ అధిగమించి రైతులు ధాన్యాన్ని అమ్ముకుందామంటే కనీస మద్దతు ధర కూడా లేదు.. ఈ దళారీ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేస్తున్నది మరొకటని అన్నదాతలు దుమ్మెత్తిపోస్తున్నారు. 

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: ధాన్యం సేకరణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. మిల్లర్ల ఇష్టారాజ్యానికి వదిలేసింది. రెండు మూడు గ్రామాలకు ఒక దళారి చొప్పున అప్పగించి, అందినకాడికి దోచుకోమని పచ్చ జెండా ఊపింది. సంచులు, లారీలు, ధర విషయంలోనూ వారికి పూర్తి స్వేచ్ఛ ఇచి్చంది. మొత్తంగా ధాన్యం కొనుగోలు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్న వారు అతి తక్కువ ధరకు అడుగుతుండటం ఊరూరా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దళారులు, మిల్లర్లు చెప్పిన రేటుకు అమ్ముకోవడం తప్ప అన్నదాతలకు మరో మార్గం లేకుండా చేసింది. రైతు నేరుగా మిల్లులోకి ప్రవేశించే పరిస్థితి లేకుండా కుతంత్రం సాగిస్తోంది. 

ధాన్యం కొనుగోలు విషయంలో ఏ దశలోనూ ప్రభుత్వ పర్యవేక్షణ అన్నదే లేదు. ధాన్యం కొనాలనే చిత్తశుద్ధి అంతకంటే లేదు. రాష్ట్రంలో రైతులకు చంద్రబాబు సర్కార్‌ కంటి మీద కునుకు లేకుండా చేయడంతో పాటు ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కలి్పంచకుండా నిలువునా దోపిడీ చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు తోడు దళారుల దందాకు వత్తాసు పలుకుతూ రైతులను నిలువునా ముంచేస్తోంది. కనీసం పెట్టిన పెట్టుబడి రాకపోగా, రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒకవైపు ఖరీఫ్‌లో ధాన్యం కోతలు ఊపందుకున్నా, మరోవైపు కొనుగోళ్లు మాత్రం ముందుకు కదలట్లేదు. ఇటీవల వరుస వాయు గుండాలు, మోంథా తుపాన్‌ రైతులను తీవ్రంగా దెబ్బ తీశాయి. మిగిలిన అరకొర పంటలను చేజిక్కించుకున్నా, అమ్ముకునే పరిస్థితి లేదు. రైతు భరోసా కేంద్రాలు, సొసైటీలు ఉత్సవ కేంద్రాలుగా మారాయి. కనీసం పంట పట్టుబడికి గోనె సంచులూ సమకూర్చలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం మిన్నకుండిపోయింది. ఫలితంగా రోజుల తరబడి రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసి ఎత్తుకోవడం.. లేదా దళారులు అడిగిన రేటుకు ఇచ్చేయడం తప్ప మరో దారి కనిపించట్లేదు.    

దళారుల దోపిడీ పర్వం
చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నడూ రైతులకు మద్దతు ధర అందించిన పాపాన పోలేదు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల దోపిడీ పర్వానికి తెరతీసి వేడుక చూస్తోంది. పేరుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టినా, దళారుల అనుమతి లేకుండా ఒక్క గింజ కూడా పంట పొలం నుంచి మిల్లులకు చేరే పరిస్థితి లేదు. పంటను మద్దతు ధరకు విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లినా, నిరాశే ఎదురవుతోంది. రోజుల తరబడి షెడ్యూల్‌ ఇవ్వక పోవడం, గోనె సంచులు సమకూర్చక పోవడంతో కోసిన పంటను నిల్వ చేసుకునేందుకు అగచాట్లు పడాల్సి వస్తోంది. ఒకవేళ పట్టుబడి చేసినా రోజుల తరబడి లోడు మిల్లులకు చేరట్లేదు. అదే, దళారులు చెప్పిన రేటుకు ధాన్యాన్ని ఇస్తే మాత్రం క్షణాల్లో తరలించేస్తున్నారు. ఫలితంగా రైతులు 75 కిలోల బస్తాను రూ.400–500 తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తోంది. అంటే, సాధారణ రకానికి రూ.1,777, ఏ–గ్రేడ్‌కు రూ.1,792 మద్దతు ధర ఉంటే.. దళారులు ఇచ్చేది రూ.1,200–1,300 మాత్రమే.  
 

ఆరు కోట్ల గోనె సంచులు ఎక్కడ?
ఖరీఫ్‌లో ధాన్యం సేకరణకు ఏకంగా 7,53,000 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ, క్షేత్ర స్థాయిలో రైతులకు పంట పట్టుబడికి మాత్రం సంచులు దొరకట్లేదు. ఏలూరు జిల్లా చింతలపూడిలో గోనె సంచుల కోసం రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. మరో వైపు 30 వేలకు పైగా రవాణా వాహనాలు సిద్ధం చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నా, లోడింగ్‌కు మాత్రం కనీసం ట్రాక్టర్లు కూడా అందుబాటులో ఉండట్లేదు.  ఇదిలా ఉండగా, ఇటీవల పౌర సరఫరాల సంస్థ వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ కాంట్రాక్టును, వాటి సాఫ్ట్‌వేర్‌ను ఉత్తర భారతదేశానికి చెందిన ఓ సంస్థకు అప్పగించింది. ఇప్పుడు ఒకే సంస్థ పరిధిలో అన్ని రకాల జీపీఎస్‌ డివైజ్‌న్లను అనుసంధానం చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా చాలా చోట్ల జీపీఎస్‌లు పనిచేయక పోవడంతో లారీల్లో లోడింగ్‌కు ముందుకు రావట్లేదు.   

బ్యాంకు గ్యారంటీలు కట్టని మిల్లర్లు 
ప్రభుత్వం 3,013 రైతు భరోసా కేంద్రాలు, 2,061 పీపీసీ (పీఏసీఎస్‌)ల ద్వారా ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేసినట్టు చెబుతోంది. కానీ, చాలా చోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. ఇక్కడ అధికారులు, దళారులు కుమ్మక్కులో భాగంగా కొనుగోలు కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించేలా పరోక్షంగా కుట్ర చేస్తున్నారు. అంటే.. ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనకపోగా.. దళారులతో కలిసి రైతులను దోపిడీ చేస్తూ.. మళ్లీ అదే దళారీ, రైతు పేరుతోనే ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముకుని లాభపడేలా దోపిడీ వ్యవస్థను ప్రోత్సహిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో మిల్లర్లు రూ.3 వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 50 శాతం కూడా ఇవ్వలేదు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో మిల్లులకు ధాన్యాన్ని తరలించలేక అధికార యంత్రాంగం చేతులు ఎత్తేస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం వాట్సాప్‌లో ‘హాయ్‌’ అని మెసేజ్‌ పెట్టగానే.. ధాన్యం కొంటామంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ, రైతు నేరుగా కొనుగోలు కేంద్రానికి వెళ్లినా పట్టించుకునే నాథుడే లేడు.    

తేమ.. తూకంలోనూ మోసం! 
మోంథా తుపాన్‌ దెబ్బతిన్న పంటను కోత కోయించే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఎకరానికి రూ.4 వేలు పెట్టి మిషన్ల ద్వారా కోతలు కోయిస్తున్నారు. కోసిన పంటను కోసినట్టు అమ్ముకుందామంటే ప్రభుత్వం 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే నిరాకరిస్తోంది. ప్రభుత్వం రైతులకు పంట ఒబ్బిడికి టార్పాలిన్లు ఇవ్వకపోగా, తేమ శాతం పేరుతో కొనుగోలుకు నిరాకరిస్తోంది. రంగుమారిన ధాన్యాన్నీ కొనడం లేదు. దీనికి తోడు గోనె సంచికి రెండు కిలోల బరువు కట్టి, అంతే మొత్తాన్ని రైతుల ధాన్యంలో నుంచి లాగేస్తున్నారు. ఇదిలా ఉండగా ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 81 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొంటామని చెప్పింది. అయితే తుపాను, ఇతర కారణాల వల్ల అంత దిగుబడి రాలేదు. ఇప్పటిదాకా 7.19 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది.  

తుపాను వస్తేనే పరదాలు ఇస్తారట!  
ఈ రైతు పేరు ఆరుమళ్ల రాజశేఖర్‌రెడ్డి. కృష్ణా జిల్లా పామర్రు గ్రామం. సొంత పొలం మూడెకరాలు, మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మొత్తం ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. ప్రస్తుతం మిషన్‌ సహాయంతో రెండు ఎకరాలు నూరి్పడి చేశాడు. ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చు అయింది. దిగుబడి ఎకరాకు 25–27 బస్తాలే వస్తోంది. పంటను ఆరబెట్టుకునేందుకు పరదాలు (టార్పాలిన్లు) కావాలని ఆర్బీకేకు వెళ్లి అడిగాడు. ‘ప్రస్తుతం పరదాలు ఇచ్చేది లేదు.. తుపాను వస్తేనే ఇస్తాం’ అని చెప్పారని వాపోయాడు. గోనె సంచులైతే చిరిగిపోయినవి ఇస్తున్నారని, కష్టపడి పంటను ఆరబెట్టుకుంటే లోడింగ్‌కు లారీలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.    

తక్కువకు రేటు కడదామని చూస్తున్నారు  
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరుకు చెందిన ఎస్‌ సత్యనారాయణ ఐదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇటీవల మోంథా తుపాను వల్ల పొలం నీట మునిగి పోవడంతో నష్టపోయాడు. ఒక్క రూపాయి పరిహారం రాలేదు. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి మళ్లీ తుపాను హెచ్చరిక రావడంతో భయంతో కోతలు ప్రారంభించాడు. అధిక వ్యయంతో యంత్రా­లతో కోతలు నిర్వహిస్తే ఎకరాకు 33 బస్తాల ధాన్యమే దిగుబడి వచి్చంది. మద్దతు ధర దక్కడం గగనంగా మారింది. పొలాల వద్దకు వచ్చే వ్యాపారులు 75 కిలోల బస్తా రూ.1,300కే అడుగుతున్నారు. విక్రయించేందుకు సిద్ధమైనా 
సిండికేట్‌గా ఏర్పడి కొనుగోలు చేయకుండా మరింత తక్కువ రేటు కడదామని చూస్తున్నారని వాపోయాడు.  

ధాన్యం ఎవరికి అమ్మాలి? 
గత నెలలో తుపాను కారణంగా కురిసిన వర్షాలకు ధాన్యం బాగా దెబ్బతింది. తేమ అధికంగా వస్తోంది. రెండు రోజుల కిందట కోతలు మొదలు పెట్టాం. వాతావరణంలో మార్పులు రావడంతో హడావిడిగా ఒబ్బిడి చేస్తున్నాం. ధాన్యం కల్లాల్లోనే బరకాలతో కప్పి ఉంది. ఆర్‌బీకేలో సవాలక్ష  నిబంధనలు పెట్టారు. వ్యాపారులు కూడా తక్కువ ధరకు అడుగుతున్నారు. ఈ పరిస్థితిలో ధాన్యాన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు.  – పెద్దిరెడ్డి సత్యనారాయణ, గాడిలంక, 
    -ముమ్మిడివరం మండలం, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా  

రోజుకో రేటు 
నేను రెండు ఎకరాల్లో వరి సాగు చేశా. కొనుగోలు కేంద్రంలో స్పందన లేకపోవడంతో ఏజెంట్లను అడిగితే రోజుకో రేటు చెబుతున్నారు. మూడు రోజుల కిందట రూ.1,400 ఉంటే, ఇప్పుడు అది రూ.1,330కి పడిపోయింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం అమ్మాలంటే సవాలక్ష నిబంధనలు పెట్టారు. తేమ శాతం, పొట్టు, మట్టి గెడ్డలు, పూర్తిగా ఆరబెట్టినవి మాత్రమే కొనుగోలు చేస్తారట. ధాన్యం ఆరబెట్టడానికి జాగా లేని మేము ఏం చేయాలి? 
    – కట్టేపోగు నాగులు, శృంగారపురం గ్రామం, దుగ్గిరాల, గుంటూరు జిల్లా  

గోనె సంచులు ఇవ్వట్లేదు  
నేను ఎకరానికి రూ.20 వేలు వంతున ఖర్చు చేసి 13 ఎకరాలలో వరి సాగు చేశా. నూరి్పడులు కూడా పూర్తయ్యాయి. వాతావరణ మార్పుల హెచ్చరికలతో గుండెల్లో గుబులు మొదలైంది. నాకు ఈ ధాన్యం పట్టడానికి 500 గోనె సంచులు అవసరం. కానీ, 200 మాత్రమే ఇచ్చారు. తుపాను ఆందోళనతో గోనెలు లేకపోతే పంట నష్టపోవడం కంటే దళారులకు అమ్ముకోవడం ఉత్తమం అనిపిస్తుంది. అయితే, క్వింటాకు రూ.400 నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం గోనె సంచులు ఇవాలి.
     – కనకల శ్రీనివాసరావు, బోని, ఆనందపురం మండలం, విశాఖపట్నం  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement