సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డలో ఓ హోంగార్డు సెల్ఫీ వీడియో వైరల్ కావడం కలకలం రేపుతోంది. ఇసుక, రేషన్ బియ్యం, పేకాట వ్యవహారం విచ్చలవిడిగా నడుస్తోందని.. నిజాయితీగా డ్యూటీ చేస్తుంటే ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ హోంగార్డు వాపోయాడు. ఈ క్రమంలో తన తోటి హోంగార్డులపైనా సంచలన ఆరోపణలు చేశాడు.
హోంగార్డు నరేష్ విడుదల జిల్లా ఎస్పీకి పంపిన ఆ ఫిర్యాదు వీడియోలో.. నా తోటి హోంగార్డులు దుర్గారావు, జరుగు శ్రీనుతో పాటు టీవీ5కి చెందిన ఓ ప్రతినిధి నన్ను వేధిస్తున్నారు. అవనిగడ్డలో ఇసుక , రేషన్ బియ్యం , పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. నా డ్యూటీ నేను చేసినా నన్ను టార్గెట్ చేశారు. నా డ్యూటీ నేను చేయడం తప్పా. నేను దళితుడిగా పుట్టడమే తప్పా. అవనిగడ్డలో పనిచేయాలంటే నాయుడిగానే పుట్టాలా?..
పేకాట ఆడేవారిని పట్టుకున్నా ఎమ్మెల్యే మనుషులంటూ హోంగార్డు దుర్గారావు విడిచిపెట్టేస్తున్నారు. నన్ను మోపిదేవి నుంచి హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేయించారు. నన్ను వేధిస్తున్నారు. మీరే న్యాయం చేయండి. మీరు న్యాయం చేయకపోతే చనిపోమన్నా చనిపోతాను. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వడం లేదు.. మీరు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలిసి మీకు నా ఆవేదన పంపిస్తున్నా. దయచేసి అవనిగడ్డ డివిజన్ లో పోలీసు వ్యవస్థను చక్కదిద్దండి.


