అసభ్య పదజాలంతో దూషణ
సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు
ఇది వైరల్ కావడంతో తాపీగా స్పందించిన పోలీసులు..
నిందితుడి అరెస్ట్.. విశాఖలో ఘటన
అల్లిపురం (విశాఖ): విశాఖ జగదాంబ జంక్షన్‌లో పట్టపగలు బస్సుదిగి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై అకస్మాత్తుగా ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆమె చెంపపై బలంగా కొట్టాడు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించాడు. ఈ హఠాత్పరిణామానికి హతాశురాలైన ఆమె హాహాకారాలు చేసినా స్థానికులు, పోలీసులు స్పందించకపోవడంతో తీవ్రంగా కలత చెందింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనను వివరిస్తూ సోషల్ మీడియాలో బాధితురాలు తన ఆవేదనను వెలిబుచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె కథనం ప్రకారం.. మధురవాడకు చెందిన దేవి జగదాంబ జంక్షన్‌లో బస్సు దిగి నడిచి వెళ్తుండగా కనకమహాలక్ష్మి మాలధారణలో ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ఆమె చెంపపై గట్టిగా కొట్టడంతో పాటు ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు. ఈ దాడికి ఆమె కళ్లజోడు కిందపడి విరిగిపోయింది. అత్యంత రద్దీగా ఉండే జగదాంబ సెంటర్లో ఈ ఘటన జరిగినప్పటికీ, స్థానికులు, పోలీసులు స్పందించకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దిశ పోలీసులకూ ఫిర్యాదు చేశారు. బాధితురాలి పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడు మానసిక రోగి అని పోలీసులు ముక్తాయింపునివ్వడం గమనార్హం.


