విశాఖపట్నం: సెన్యార్ ముప్పు తొలగిందని అనుకునేలోపే మరో తుపాను దూసుకొస్తోంది. దీనికి దిత్వాగా నామకరణం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం.. శ్రీలంక వైపు కదులుతూ రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను భారత వాతావరణ శాఖ(IMD) అప్రమత్తం చేసింది.
దిత్వా ప్రస్తుతం ట్రింకోమలీ(శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదిలింది. ఆదివారం తెల్లవారుజాముకి నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది.
ఈ ప్రభావంతో.. శని, ఆదివారాల్లో తమిళనాడు, ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. దీంతో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ తుపాను దిత్వాగా యెమెన్ నామకరణం చేసింది. దీనర్థం పువ్వు అని.


