సాక్షి, తాడేపల్లి: ఆదాయం వచ్చే అన్ని శాఖల్లో వేలుపెడుతూ.. తనకు ఇచ్చిన శాఖను మాత్రం మంత్రి నారా లోకేష్ గాలికి వదిలేశారని వైఎస్సార్‌సీపీ గుంటూరు అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు..
నారా లోకేష్ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు. ప్రభుత్వ హస్టళ్లలో అన్నంలో పురుగులు వస్తున్నాయి. కలుషిత ఆహారం తిని విద్యార్థులు రోగాల పాలవుతున్నా పట్టించుకోవటం లేదు. కామెర్లతో పిల్లలు చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. నారా లోకేష్ విద్యా, ఐటీ శాఖలను గాలికి వదిలేశారు. సీఎంగా ట్రైనింగ్ అవుతున్నారు. ఆదాయం ఉన్న శాఖల్లో వేలుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో ఆయన ఉన్నారు. చిన్నవయసులోనే ప్రవచనాలు చెబుతూ కొత్త అవతారం ఎత్తారు.
సోషల్ మీడియాలో జగన్ పై ఏఐ వీడియోలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒకవైపు దారుణమైన పోస్టులు పెట్టిస్తూ మరోవైపు ట్వీట్ లో ప్రవచనాలు చెప్తున్నారు. రాజకీయాల్లో దుష్ట సంప్రదాయాలు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు. మీడియాను అడ్డు పెట్టుకుని ప్రచారం పొందటమే పనిగా పెట్టుకున్నారు. పిల్లల ముందు చంద్రబాబు దారుణమైన అబద్దాలు చెప్పారు. తన వెన్నుపోటు రాజకీయాల గురించి వాస్తవాలు చెబితే బాగుండేది.
చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ యాంటీ హీరోలుగా తయారయ్యారు. హీరోలుగా నటిస్తూ విలన్ పనులు చేస్తున్నారు. వైఎస్ జగన్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. అటు చంద్రబాబు కోసమూ పవన్ కల్యాణ్ వైఎస్సార్‌సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వం వచ్చాకే కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని పవన్ కళ్యాణ్ అబద్దాలు చెప్పించే ప్రయత్నం చేశారు. కానీ నిజాలేంటో అక్కడి రైతులే చెప్పారు(ఈ సందర్భంగా రైతులు పవన్ ఎదుట మాట్లాడిన వీడియోను అంబటి ప్రదర్శించారు. ప్రశ్నించటానికే పుట్టిన పార్టీ అని చెప్పుకున్న పవన్ ఎదుటివారు ప్రశ్నిస్తే తట్టుకోలేక పోతున్నారు. కూటమికి సపోర్టు చేసిన విషయమ్మీద తన మనిషే ప్రశ్నించినా సమాధానం చెప్పలేక పోయిన పిరికి వ్యక్తి పవన్. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగానే కాదు.. మంత్రిగా కూడా పనికి రాడు. అసలు రాజకీయాలకే పనికి రాని వ్యక్తి పవన్’’ అని అంబటి మండిపడ్డారు.

బూతులు మాట్లాడటంలో పవన్ కళ్యాణ్ ని మించినవారు లేరు. సోషల్ మీడియాలో లోకేష్ ఆర్గనైజ్డ్‌గా బూతులు మాట్లాడిస్తున్నారు. పవర్ లేని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన జస్ట్ ఫోటోల ఉప ముఖ్యమంత్రి. అసలైన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తోంది మాత్రం లోకేష్. అమరావతి నిర్మాణంలో వందల కోట్ల అవినీతి జరుగుతోంది. లోకేష్, పవన్ కళ్యాణ్ దోచుకుని దాచుకుంటున్నారు. ప్రజలే సరైన సమయంలో సమాధానం చెప్తారు. అధికారం కోసం ఇతరుల కాళ్లు పట్టుకోవడం కాదు. మేము కూటమితో పోరాడి అధికారంలోకి వస్తాం అని అంబటి ఉద్ఘాటించారు.


