హరిలోరంగ హరి..
సంక్రాంతికి ప్రతీకలుగా హరిదాసులు ధనుర్మాసంలో గ్రామాల్లో హరిదాసులకు విశేష ఆదరణ రాముడి రాజ్యం నుంచి హరిదాసులు ఉన్నారని నానుడి కొన్ని ప్రాంతాల్లో కనిపించని, వినిపించని హరిదాసు గానం
హరిదాసుడంటే..
హరిదాసు అనగా పరమాత్మకు ప్రతిరూపం అని చెబుతుంటారు. హరిదాసుల రాక సంక్రాంతికి సంకేతం. ఆకర్షణీయమైన తెల్లని పంచె, ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబుర, దేహంపై హరినామాలు, తలపై అక్షయపాత్ర, మెడలో పూలదండ, కాళ్లకు గజ్జెలతో హరిదాసులు గ్రామాల్లో కనిపిస్తారు. ప్రజలు ఇచ్చే దాన ధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని దీవించే వారే హరిదాసులు. ధనుర్మాసం ఆరంభమైన నాటి నుంచి సరిగ్గా నెల రోజుల పాటు వీధివీధినా హరి నామాన్ని గానం చేస్తూ పండుగ నాడు ధన, ధాన్య, స్వయంపాకాలను స్వీకరిస్తారు.
ప్రత్తిపాడు: ధనుర్మాసం.. ప్రభాత వేళ.. ‘హరిలోరంగ హరి’ అంటూ పల్లె ముంగిట వినిపించే హరిదాసుని గానం సంక్రాంతికి ప్రతీక. రామరాజ్యం నుంచి వస్తున్న సంప్రదాయం, పాశ్చాత్య పోకడల ధాటికి కాస్తంత మసకబారుతున్నప్పటికీ సంక్రాంతికి హరిదాసు పాత్ర ప్రత్యేకం. వీధుల్లో వినిపించే హరిగానం సంక్రాంతి శోభను కళ్లకు కడుతుంది. ధనుర్మాసంలో గ్రామగ్రామాన కనిపించే హరిదాసులపై ప్రత్యేక కథనం..
సంక్రాంతి నెలలో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసుని గానం. పూర్వం పల్లె, పట్టణం తేడా లేకుండా తెల్లవారుజామునే, ఇంటి ముంగిట ముగ్గులేసే సమయానికే పురవీధుల్లో హరినామ గానం చేస్తూ కీర్తనలతో అలరిస్తూ హరిదాసులు ప్రజలు ఇచ్చే ధన, ధాన్యాలను స్వీకరించేవారు. వీరి రాక సంక్రాంతి నెలకు శోభను తెస్తుంది. ధనుర్మాసాన్ని గుర్తుచేస్తుంది.
రాముడి రాజ్యంలో
శ్రీరాముడి రాజ్యంలో చింతలు లేవు. కరువు కాటకాలు రావు. దాన ధర్మాలు చేద్దామన్నా పుచ్చుకునే వారే కరువయ్యారని ప్రజలు ధర్మదేవతను ఆడిపోసుకునేవారట. అది విన్న వేగులు రాముడితో విషయాన్ని చెప్పగా వారి దాన ధర్మాలను పుచ్చుకునేందుకు హరినామాన్ని గానం చేసే గాయకులను రాజ్యంలో తిరిగేలా చేశారని, వారే నేడు కనిపించే హరిదాసులని పండితులు, పెద్దలు, పూర్వీకులు చెబుతుంటారు.
పరమ పవిత్రం అక్షయపాత్ర..
అక్షయ అనగా ఎప్పుడూ నిండుగా ఉండేదని అర్థం. పంచలోహంతో తయారు చేసిన అక్షయపాత్రను శిరస్సుపై ధరిస్తారు. అక్షయపాత్రకు ఎంతో చరిత్ర ఉంది. ఈ పాత్ర శిరస్సుపై ఉన్నంత వరకు అకుంఠిత దీక్షతో నారాయణుడే గ్రామాల్లో సంచరిస్తున్నాడనేంత పవిత్రంగా ఉంటారు. అక్షయపాత్ర నిండిన సమయంలో బిక్షను సమీప ఇంటిలో భద్రపరుస్తారు. ఈ పాత్రలో బిక్షవేయడం స్వయంగా నారాయణుడికి నైవేద్యం సమర్పించినట్లేనని పెద్దలు చెబుతుంటారు.
సంప్రదాయం ‘హరీ’
కల్చర్ మారుతోంది. పాశ్చాత్య పోకడలు శృతిమించిపోతున్నాయి. సంప్రదాయాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. అందులో భాగంగా హరిదాసుల రాకడ కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు ప్రతి గ్రామంలో ధనుర్మాసంలో దర్శనమిచ్చే హరిదాసులు.. ఇప్పుడు అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నారు. కారణం వారికి గ్రామాల్లో ఆశించినంతగా ఆదరణ లేకపోవడం, నేటి తరం వీరి పట్ల పూర్వపు ఆదరణను చూపకపోతుండటమేనని తెలుస్తోంది.


