కమ్యూనిటీ.. ఉగ్గబట్టుకోవాల్సిందేనా..!
ప్రత్తిపాడు: అధికారుల నిర్వాకంతో కమ్యూనిటీ టాయిలెట్లుకు తాళాలు పడ్డాయి. కమ్యూనిటీ టాయిలెట్లుకు తాళాలు ఏమిటి.. అని ఆశ్యర్యపోతున్నారా.. అవును మరి అధికారులా మజాకా.. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గ్రామ సచివాలయం–2 వద్ద మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించారు. అయితే వీటిని అందరూ ఎందుకు వినియోగించుకోవాలనుకున్నారో లేక మరేదైనా కారణమో తెలియదు గానీ తాళాలు వేసేస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయం ఊరి చివర ఉండటం, అందులోనే వెలుగు, ఉపాధి, హౌసింగ్, వ్యవసాయశాఖ కార్యాలయాలు కూడా ఉండటంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇక్కడకు నిత్యం మహిళలు వస్తుంటారు. వీరు అత్యవసరంగా మల, మూత్ర విసర్జనలకు వెళ్లాలంటే కమ్యూనిటీ టాయిలెట్లుకు తాళాలు వేసి ఉండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిరిగి వారి గ్రామాలకు వెళ్లే వరకు ఉగ్గబట్టుకుని ఉండాల్సిన దుర్గతి చోటుచేసుకుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి కమ్యూనిటీ టాయిలెట్లుకు వేసిన తాళాలు తీయించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రత్తిపాడులో టాయిలెట్లుకు తాళాలు
కమ్యూనిటీ.. ఉగ్గబట్టుకోవాల్సిందేనా..!


