వడ్డే ఓబన్న గొప్ప స్వాతంత్య్ర పోరాట యోధుడు
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: వడ్డే ఓబన్న గొప్ప స్వాతంత్య్ర పోరాట యోధుడని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా కొనియాడారు. ఆయన జయంతి కార్యక్రమం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యే గళ్లా మాధవి, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న జీవిత చరిత్ర గొప్ప స్ఫూర్తిదాయకమన్నారు. జీవిత చరిత్రను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. పాఠ్యాంశంగా పెట్టాలనే సూచనను జిల్లా యంత్రాంగం తరపున ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ దేశం కోసం, బడుగు వర్గాల కోసం వడ్డే ఓబన్న పని చేశారన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి స్నేహితునిగా, ప్రాణ రక్షకునిగా నిలిచారని తెలిపారు. ఒక కులానికే ఆపాదించకుండా ఓబన్న ఆశయాలను అమలు చేయడంలో సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శైలజ గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి, దేవుల మల్లికార్జున, వెనుకొండ శ్రీనివాస్, జె.నాగేశ్వరరావు, చల్లా లీలా భానుప్రసాద్, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


