ఇళ్లల్లో చోరీలకు పాల్పడే పాత నేరస్తుడు అరెస్ట్
28 ఏళ్లల్లోనే పది కేసులు, రౌడీషీట్ నమోదు రూ.9.11 లక్షల విలువైన సొత్తు సీజ్ చేసిన పోలీసులు
నగరంపాలెం: ఇళ్లల్లో చోరీలకు పాల్పడే పాత నేరస్తుడ్ని తాడేపల్లి పీఎస్ పోలీసులు అరెస్ట్ చేయగా, సుమారు రూ.9.11 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలను వెల్లడించారు. తాడేపల్లి నులకపేటలో ఉంటున్న గోలి శౌరీఆనంద్‌కుమార్ కుటుంబ సభ్యులు క్రిస్మస్ పండుగ సందర్భంగా గతనెల 24 రాత్రి చర్చికి వెళ్లారు. ప్రార్థనలు ముగించుకుని అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. మొదటి అంతస్తులోని గది వెనుక తలుపు గడియ విరిగి ఉండడాన్ని బాధితుడు గమనించాడు. బీరువాలో దాచిన రూ.2.10 లక్షలు కనిపించకపోవడంతో తాడేపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐ వీరేంద్రబాబు, ఎస్‌ఐ వెంకటసాయికుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు. ఇదే తరహాలో వరుసగా చోరీలు జరగ్గా, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పలు చోరీ కేసుల్లో పాత నేరస్తుడు, రౌడీషీటర్ ప్రస్తుతం తాడేపల్లి నులకపేటలో ఉంటున్న కృష్ణలంక రణధీర్‌నగర్ వాసి షేక్ హుస్సేన్ అలియాస్ బెగ్గర్‌ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం రుజువై, గతంలో తొమ్మిది చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. పది దొంగతనాల కేసుల్లో రూ.4.79 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.4.32 లక్షలు సీజ్ చేశారు.
తాళాలు తీయడంలో దిట్ట..
28 ఏళ్ల హుస్సేన్‌పై రౌడీషీట్ ఉందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పగలు, రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడని తెలిపారు. కేవలం చేతులతోనే తాళాలను తొలగించి లోనికెళ్లేవాడని తెలిపారు. ఇంట్లోకి చేరిన క్షణాల్లో అందిన వరకు దోచేసేవాడని విచారణలో వెల్లడైందన్నారు. వరుస చోరీల కేసులను ఛేదించిన ఉత్తర డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి పీఎస్ సీఐ వీరేంద్రబాబు, ఎస్‌ఐలు ప్రదీప్, వెంకటసాయికుమార్, అపర్ణ, హెచ్‌సీలు రవి, కోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు వి.ప్రసాదరావు, అనిల్, రవి, జోసెఫ్‌లను అభినందించి, ప్రశంసాపత్రాలను జిల్లా ఎస్పీ అందించారు. జిల్లాలో తరుచూ చోరీలకు పాల్పడే వారిపై పీడీ చట్టం ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ హెచ్చరించారు.


